Tilak Varma: హైదరాబాద్ బ్యాటింగ్ సంచలనంతో ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్
- ఐపీఎల్ లో పరుగుల మోత మోగిస్తున్న తిలక్ వర్మ
- ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న 20 ఏళ్ల తిలక్
- రిలయన్స్ ఆధ్వర్యంలోని రైజ్ తో ఒప్పందం
- తిలక్ వర్మకు బ్రాండ్ మేనేజర్ గా కొనసాగనున్న రైజ్
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ బ్యాటింగ్ స్టార్ తిలక్ వర్మ తన సంచలన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ సీజన్ లో తిలక్ వర్మ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 84 పరుగులు, చెన్నై సూపర్ కింగ్స్ పై 22 పరుగులు, ఢిల్లీ క్యాపిటల్స్ పై 41 పరుగులు చేసి తన ఫామ్ చాటుకున్నాడు.
ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి రిలయన్స్ సంస్థ యజమాని అని తెలిసిందే. దాంతో 20 ఏళ్ల తిలక్ వర్మకు అద్భుతమైన ఆఫర్ లభించింది. రిలయన్స్ సంస్థ యువ సంచలనం తిలక్ వర్మతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ పై రిలయన్స్ అనుబంధ సంస్థ రైజ్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంతో ప్రతిభావంతుడైన తిలక్ వర్మను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని రైజ్ కంపెనీ వెల్లడించగా.... రైజ్ వరల్డ్ వైడ్ బృందంలోకి అడుగుపెట్టడం పట్ల ఎంతో ఉద్విగ్నతకు లోనవుతున్నానని, ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తిలక్ వర్మ తెలిపాడు.
రైజ్ సంస్థ ఆటగాళ్ల బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, ఇతర ఒప్పందాలు, స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కార్యకలాపాలను నిర్వర్తిస్తుంటుంది. ఇకపై రైజ్ సంస్థ తిలక్ వర్మకు వాణిజ్యపరమైన మేనేజర్ గా వ్యవహరిస్తుందని భావించవచ్చు.
రైజ్ కంపెనీ ఇప్పటికే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్, యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్యాలకు బ్రాండ్ ఇమేజ్, కమర్షియల్ ఎంగేజ్ మెంట్స్ మేనేజర్ గా వ్యవహరిస్తోంది.