Kodikathi Sreenu: జగన్ ను పొడిచిన కోడికత్తిని రెండు సార్లు స్టెరిలైజ్ చేశాను: నిందితుడు శ్రీను
- జగన్ కు సానుభూతి రావాలనే కోడికత్తితో దాడి చేశానన్న శ్రీనివాసరావు
- 160 సీట్లతో గెలుస్తారని జగన్ కు చెప్పానని వెల్లడి
- జగన్ అధికారంలోకి వస్తే సమస్యలు తీరుతాయని భావించానని వ్యాఖ్య
గత ఎన్నికల ముందు విశాఖ విమానాశ్రయం లాంజ్ లో జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడి వెనుక కుట్ర కోణం లేదని కోర్టుకు ఎన్ఐఏ తెలిపింది. కుట్రను వెలికి తీసేలా దర్యాప్తు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్ కు విచారణార్హత లేదని, జగన్ పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును కోరింది. విచారణ సమయంలో నిందితుడు శ్రీనివాసరావు చెప్పిన వివరాలను కూడా కోర్టుకు అందజేసింది.
విచారణలో శ్రీనివాసరావు ఏం చెప్పాడంటే... "జగన్ అంటే నాకు చాలా ఇష్టం. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నా. మీడియా ద్వారా జగన్ కు సానుభూతి వచ్చేందుకే కోడికత్తితో దాడి చేశాను. జగన్ ను పొడిచిన కోడికత్తిని రెండు సార్లు స్టెరిలైజ్ చేశాను, ఎయిర్ పోర్టులో జగన్ కు టీ ఇచ్చేందుకు వెళ్లి... మీరు 160 సీట్లతో గెలుస్తారని చెప్పాను. దానికి ఆయన చిరునవ్వు నవ్వారు. జగన్ ను పొడిచిన వెంటనే వైసీపీ వాళ్లు నన్ను బాగా కొట్టారు. పోలీసులు వారి నుంచి నన్ను కాపాడి ఒక గదిలో బంధించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
అప్పట్లో విచారణ సందర్భంగా ఏపీ పోలీసులు నన్ను బాగా కొట్టారు. నా సొంత ఆలోచన మేరకే జగన్ పై దాడి చేశానని నేను చెప్పాను. ఒక పార్టీకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో చెప్పాలని పోలీసులు నాపై ఒత్తిడి తీసుకురాలేదు. అందుకే జడ్జి వద్ద పోలీసులపై నేను ఒక్క ఆరోపణ కూడా చేయలేదు. జగన్ అధికారంలోకి వస్తే సమస్యలు తీరుతాయని భావించాను. జగన్ కు, నా తల్లిదండ్రులకు క్షమాపణలు చెపుతున్నాను" అంటూ పేర్కొన్నాడు. శ్రీనివాసరావు చెప్పిన ఈ మాటల రికార్డును కోర్టుకు ఎన్ఐఏ అందించింది.