Chandrababu: తనకు ఓట్లేసిన దళితులపైనే జగన్ దాడులు చేయిస్తున్నారు: చంద్రబాబు

Chandrababu pays tributes to Ambedkar in Gudivada

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • గుడివాడలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత
  • అంబేద్కర్ ఒక అసాధారణ శక్తి అని కొనియాడిన వైనం
  • అంబేద్కర్ కు నిజమైన వారసుడు ఎన్టీఆర్ అని ఉద్ఘాటన 
  • అంబేద్కర్ ఆశయాలను టీడీపీ ముందుకు తీసుకెళుతుందని వెల్లడి

ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ గుడివాడలో అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. 

సాధారణ కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ అసాధారణ శక్తిగా ఎదిగారని కొనియాడారు. దేశ భవిష్యత్తు కోసం బాబా సాహెబ్ అందించిన సేవలు మరువలేనివని, ఆయన ఆశయాలను టీడీపీ ముందుకు తీసుకెళుతుందని తెలిపారు. నాడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే అప్పటి కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ కు భారతరత్న ప్రకటించిందని గుర్తు చేశారు. అంబేద్కర్ కు నిజమైన వారసుడు ఎన్టీఆరేనని అన్నారు. 

దళిత వర్గానికి చెందిన కేఆర్ నారాయణన్ ను రాష్ట్రపతిగా ప్రతిపాదించి గెలిపించింది టీడీపీయేనని పేర్కొన్నారు. అదే వర్గానికి చెందిన బాలయోగిని లోక్ సభ స్పీకర్ గా చేశామని చంద్రబాబు వెల్లడించారు. కాకి మాధవరావును సీఎస్ చేసిన ఘనత కూడా టీడీపీకే చెందుతుందని వివరించారు. అంటరానితనం నిర్మూలన కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసింది కూడా టీడీపీయేనని, సిఫారసులు కూడా ఆమోదించామని చెప్పుకొచ్చారు. 

అమరావతిలో భారీ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, కానీ వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. 

"అంబేద్కర్ కేవలం ఎస్సీలకే సంబంధం అని చాలామంది భావిస్తారు. అంబేద్కర్ దేశ ప్రజల మనిషి... భారతదేశ ఆస్తి. ఎస్సీల్లో ఎక్కువమంది పేదలు ఉన్నారు కాబట్టి వాళ్ల కోసం రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందుపరిచిన విషయం అందరూ గుర్తించాలి. అంబేద్కర్ ఎస్సీల కోసమే కాదు... మహిళల సమానత్వం గురించి కూడా ఆలోచించారు. రాజ్యాంగం రాసిన తర్వాత నెహ్రూ క్యాబినెట్లో అంబేద్కర్ మంత్రిగా చేరారు. అంతటి రాజ్యాంగ నిర్మాత కూడా మహిళలకు ఆస్తిలో హక్కు బిల్లును ఆయన ఆమోదింపజేసుకోలేకపోయారు. 

కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి అంబేద్కర్ స్ఫూర్తిని ఘనంగా చాటిచెప్పారు. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కూడా ఎన్టీఆరే. దళితులపై వివక్ష చూపితే అక్కడికక్కడే శిక్ష పడేలా మొబైల్ కోర్టులు తీసుకువచ్చాం. అంటరానితనం నిర్మూలనకు పాటుపడిన పార్టీ టీడీపీ. 

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ. పాము తన గుడ్లు తానే తిన్నట్టు... తనకు ఓటేసిన వారిపైనే జగన్ దాడులు చేయిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చాక చరిత్రలో ఎన్నడూ జరగనన్ని దాడులు దళితులపై ఇప్పుడే జరుగుతున్నాయి. దళిత డాక్టర్ నుంచి దళిత డ్రైవర్ వరకు... అందరూ ప్రభుత్వ దాష్టీకానికి బలైనవారే. ఎస్సీ అధికారి అచ్చెన్న చనిపోతే జగన్ ఎందుకు మాట్లాడరు? 

చట్టపరమైన హక్కులు దళితులకు అందకుండా చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. అందరికీ ముద్దులు పెట్టి, ఒక్క చాన్స్ అని అడిగి, ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు. ఎస్సీల ఇళ్లలో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే అమ్మ ఒడి ఇస్తున్నాడు జగన్. అప్పుడు ఒక్కరే చదువుకోవాలా? కానీ, టీడీపీ పేదల ఇళ్లలో, ఎస్సీల ఇళ్లలో ఎంత మంది పిల్లలు ఉన్నా ఉన్నత చదువులు అందించింది. ఎస్సీ ఎస్టీల్లోని పేదలు కూడా అభివృద్ధి చెందితేనే కానీ ఆర్థిక అసమానతలు తగ్గవు" అని చంద్రబాబు వివరించారు.

  • Loading...

More Telugu News