Prakash Ambedkar: అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు: ప్రకాశ్ అంబేద్కర్
- హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ
- కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్
- సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం అవసరమన్న ప్రకాశ్ అంబేద్కర్
- అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారని కితాబు
గణతంత్ర భారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కూడా పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగించారు.
అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం అంబేద్కర్ భావజాలం అవసరమని, సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదని ప్రకాశ్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధన పత్రం రాశారని ఆయన వెల్లడించారు. బ్రిటీష్ వాళ్లు భారతదేశాన్ని ఎలా దోచుకుంటున్నారో గ్రహించారని తెలిపారు.
అంబేద్కర్ ఆశయాలు పాటించడమే ఆ మహనీయుడికి సమర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఆర్థిక దుర్బలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారని, అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళుతున్నారని ప్రకాశ్ అంబేద్కర్ కొనియాడారు. దళితబంధు పథకం రూపొందించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.