CM KCR: ఇది నేను చెప్పే స్టోరీ కాదు: సీఎం కేసీఆర్

CM KCR speech on Ambedkar birth anniversary day

  • హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
  • తన జన్మ ధన్యమైందని వెల్లడి
  • ప్రతి ఏటా అంబేద్కర్ పేరిట అవార్డు ఇస్తామని ప్రకటన
  • అవార్డు కోసం రూ.51 కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నట్టు వివరణ

హైదరాబాద్ నగరం నడిబొడ్డున, ట్యాంక్ బండ్ చెంతన, ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే తెలంగాణ ప్రభుత్వం 125 అడుగుల ఎత్తయిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. 

ఎవరినో అడిగి అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని, విశ్వమానవుడి విశ్వరూపం ప్రతిష్టించుకున్నాం అని ఉద్ఘాటించారు. ఇది విగ్రహం కాదు విప్లవం అని అభివర్ణించారు. ఇకపై ప్రతి ఏటా అంబేద్కర్ పేరిట ఆయన జయంతి రోజున అవార్డు ఇస్తామని వెల్లడించారు. అంబేద్కర్ పేరిట అవార్డు ఇవ్వాలని ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు సూచించారని తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం రూ.51 కోట్లతో నిధి కూడా ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ సభా వేదిక నుంచి ప్రకటించారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చామని వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్ర ప్రధాన కార్యాలయం అయిన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టుకున్నామని, ఈ నెల 30 నుంచి నూతన సచివాలయం కార్యకలాపాలు షురూ అవుతాయని సీఎం కేసీఆర్ వివరించారు. వీటన్నింటికి మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన, ఆకాశాన్నంటేలా ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. 

రాజ్యాంగం ప్రారంభమై 70 ఏళ్లయినా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పేదలు ఎవరంటే దళితులే అన్నది కఠోర వాస్తవం అని పేర్కొన్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని అన్నారు. పార్టీలు ఓడిపోవడం, గెలవడం కాదు... దేశంలో ప్రజలు గెలిచేటువంటి రాజకీయం రావాలని సూచించారు. దళితులు వాస్తవిక అభివృద్ధి దిశగా పయనించేలా దళిత మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఇక్కడ వేరొక పార్టీ పదేళ్లు పాలన చేసిందని, వాళ్లు దళితుల కోసం చేసిన ఖర్చు రూ.16 వేల కోట్లు అని కేసీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఈ పదేళ్లలో, ఈ ఏడాది బడ్జెట్ కూడా కలుపుకుని, దళితుల కోసం రూ.1.25 లక్షల కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్ సగర్వంగా చెప్పారు. ఇది తాను చెబుతున్న స్టోరీ కాదని, కాగ్ చెప్పిన వాస్తవం అని వివరించారు. 

"కొన్ని విషయాలు చెప్పడానికి ఆత్మవిశ్వాసం కావాలి. నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళుతున్నా... మళ్లీ తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడతా అని ఆనాడు చెప్పాను... కచ్చితంగా అలాగే జరిగింది. పార్లమెంటులో బిల్లు పాసై తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే నేను తెలంగాణలో అడుగుపెట్టాను. అదే ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను... 2024 పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. శత్రువులకు ఇది మింగుడుపడకపోవచ్చు. చిన్న నిప్పురవ్వ చాలు అంటుకోవడానికి. ఇటీవల మహారాష్ట్రలో బీఆర్ఎస్ పట్ల వచ్చిన స్పందన ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది" అని సీఎం కేసీఆర్ తెలిపారు. 

మహనీయుడు అనదగ్గ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటుచేసే అవకాశం తనకు లభించడం పట్ల జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News