SRH: ఇవాళ సన్ రైజర్స్, నైట్ రైడర్స్ మ్యాచ్ లో అందరి దృష్టి అతడిపైనే!
- ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ పోరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
- బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్
- 2 ఓవర్లలో 28 రన్స్
ఇవాళ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది.
ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ టీమ్ ఒక మార్పు జరిగింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అభిషేక్ శర్మ తుదిజట్టులోకి వచ్చాడు. కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లో ఎలాంటి మార్పులు లేవు. గత మ్యాచ్ ఓ గుజరాత్ టైటాన్స్ పై సంచలన విజయం సాధించిన జట్టే బరిలో దిగుతోందని కోల్ కతా సారథి నితీశ్ రాణా తెలిపాడు.
కాగా, ఇవాళ్టి మ్యాచ్ లో అందరి దృష్టి కోల్ కతా బ్యాటర్ రింకూ సింగ్ పైనే ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే, గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో రింకూ సింగ్ ఆడిన విధ్వంసక ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది. ఆఖరి ఓవర్లో వరుసగా 5 సిక్సులు బాది కోల్ కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది ఈ ఎడమచేతివాటం బ్యాట్స్ మనే.
రింకూ తన సంచలన ఇన్నింగ్స్ తో ఒక్కసారి ఐపీఎల్ లో స్టార్ అయిపోయాడు. మరి, నేడు సన్ రైజర్స్ తో ఎలా ఆడతాడన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 43 పరుగులు. హ్యారీ బ్రూక్ 31, మయాంక్ అగర్వాల్ 7 పరుగులతో ఆడుతున్నారు.