NTR: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టు కోసం పరిశీలనలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు!

Is NTR and Allu Arjun can make their Bollywood debut with this movie
  • అశ్వత్థామ ఇతివృత్తంతో భారీ చిత్రం
  • జియో స్టూడియోస్ నిర్మాణంలో ఆదిత్య ధర్ సినిమా
  • వికీ కౌశల్, రణవీర్ సింగ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ప్రచారం
టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల పేర్లు ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తన డ్రీమ్ సినిమా 'ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ' కోసం వీళ్లిద్దరిలో ఒకరిని ఎంచుకోనున్నారంటూ వార్తలు వస్తుండడమే అందుకు కారణం. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, పుష్పతో అల్లు అర్జున్ హిందీలోనూ ఉత్తరాదిన కూడా ఊపేసిన సంగతి తెలిసిందే. 

ఆదిత్య ధర్, జియో స్టూడియోస్ కలయికలో మహాభారత వీరుడు 'అశ్వత్థామ' ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నట్టు టాక్ వినిపిస్తోంది. అసలు, ఆదిత్య ధర్ తన క్రేజీ ప్రాజెక్టు కోసం తొలుత వికీ కౌశల్ ను తీసుకోవాలనుకున్నా, అది వర్కౌట్ కాలేదు. వికీ కౌశల్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని జియో స్టూడియోస్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తోంది. 

ఆ తర్వాత అశ్వత్థామ కోసం రణవీర్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే, ఒక్కరోజు వ్యవధిలోనే రణవీర్ సింగ్ పేరు ఈ ప్రాజెక్టు నుంచి వినిపించడం మానేసింది. ఈ నేపథ్యంలో, పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న దక్షిణాది హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల పేర్లు ఇప్పుడు అశ్వత్థామ టీమ్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

అంతేకాదు, ఇందులో సమంత కూడా నటించనుందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
NTR
Allu Arjun
The Immortal Aswathama
Adithya Dhar

More Telugu News