YS Jagan: ఆగస్టు, సెప్టెంబరులో ఏపీ అసెంబ్లీ రద్దు.. ఆపై ఎన్నికలు: రఘురామరాజు జోస్యం
- తెలంగాణతోపాటు ఏపీ ఎన్నికలు కూడా జరుగుతాయన్న రఘురామరాజు
- కోడికత్తి, వివేకా హత్యకేసులు వాడుకుని గత ఎన్నికల్లో జగన్ గెలిచారన్న ఎంపీ
- గాయమైతే జగన్ న్యూరో సెంటర్‌లో కట్టుకట్టించుకున్నారని ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో శాసనసభను రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అదే జరిగితే, తెలంగాణతోపాటే ఏపీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాలు ఏకం కాకముందే ఎన్నికలకు వెళ్లాలని సీఎం తలపోస్తున్నారని అన్నారు.
గత ఎన్నికల్లో కోడి కత్తి, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు వైసీపీ విజయానికి కారణమయ్యాయని, ఇప్పుడీ రెండూ నాటకాలేనని తేలితే పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదని రఘురామరాజు విమర్శించారు. కోడి కత్తి దాడి తర్వాత జగన్ ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయించుకోకుండానే హైదరాబాద్ వెళ్లి సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స చేయించుకున్నట్టు నటించారని అన్నారు. అక్కడ గాయం అయినట్టు కట్టుకట్టారని అన్నారు.
నిజానికి గాయమైతే ఎవరైనా ట్రామా సెంటర్‌కు వెళ్తారని, జగన్ మాత్రం న్యూరో సెంటర్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇటీవల గన్నవరం సీఐకి దెబ్బ తగలకపోయినా తగిలినట్టు కట్టు కట్టినట్టుగానే అప్పుడు జగన్‌కు కట్టు కట్టారని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకు కట్టు కట్టిన డాక్టర్ సాంబశివారెడ్డికి ఆరోగ్యశ్రీ వైస్ చైర్మన్, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇచ్చారని రఘురామ రాజు గుర్తు చేశారు.