Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ కు ఊహించని షాక్.. దిమ్మతిరిగే ప్రకటన చేసిన ఎన్సీపీ
- విపక్షాల ఐక్యత గురించి చర్చించిన కాంగ్రెస్, ఎన్సీపీ
- రోజు గడవక ముందే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎన్సీపీ ప్రకటన
- పార్టీకి మళ్లీ జాతీయ హోదాను సాధించడమే లక్ష్యమన్న ప్రఫుల్ పటేల్
విపక్ష పార్టీల ఐక్యతకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన మరుసటి రోజే ఆ పార్టీకి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ షాక్ ఇచ్చారు. వచ్చే నెల జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఎన్సీపీ ప్రకటించింది. మొత్తం 40 నుంచి 45 స్థానాల్లో ఎన్సీపీ పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఎన్సీపీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఉత్కంఠను మరింత పెంచుతోంది.
ఈ సందర్భంగా ఎన్సీపీ కీలక నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, ఎన్సీపీకి మళ్లీ జాతీయ పార్టీ హోదాను సాధించడమే తమ లక్ష్యమని, దీనికి అనుగుణంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇటీవలే ఎన్సీపీ జాతీయ పార్టీ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదాను కూడా కోల్పోయింది. దీంతో, మళ్లీ జాతీయ హోదాను సాధించే దిశగా ఆ పార్టీ కసరత్తులు చేస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో మహారాష్ట్ర ఏకీకరణ సమితి పార్టీతో ఎన్సీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మరాఠీల జనాభా ఎక్కువగానే ఉంటుంది. దీంతో, ఈ ప్రాంతంలో ఎన్సీపీ కొంత మేర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో ఎన్సీపీ ఎన్నికల బరిలోకి దిగితే అది కాంగ్రెస్ కు నష్టం చేకూరుస్తుంది. కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఎలాగైనా అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్న కాంగ్రెస్ కు శరద్ పవార్ నిర్ణయం శరాఘాతమే అని చెప్పుకోవచ్చు.