Jammu And Kashmir: ‘ప్లీజ్ మోదీజీ.. మాకో మంచి స్కూలు కట్టివ్వరూ?’.. ప్రధానికి కశ్మీర్ బాలిక విజ్ఞప్తి.. వీడియో ఇదిగో!
- తమ స్కూలు పరిస్థితిని వీడియో తీసి చూపించిన విద్యార్థి
- ఫేస్ బుక్ లో వైరల్ గా మారిన వీడియో..
- 20 లక్షల వ్యూస్, 1.16 లక్షల లైకులు
మా ఊరిలో స్కూలు బాగాలేదు.. మాకోసం ఓ మంచి స్కూలు కట్టించి ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి కశ్మీర్ కు చెందిన ఓ చిన్నారి విజ్ఞప్తి చేసింది. మా స్కూలు ఎలా ఉందో చూడండంటూ మొబైల్ లో వీడియో తీసి చూపించింది. ఆ వీడియోను జమ్మూ కశ్మీర్ కు చెందిన మార్మిక్ న్యూస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఏకంగా 2 మిలియన్ల (20 లక్షల) వ్యూస్, 1,16,000 మంది లైక్ చేశారు. ఈ వైరల్ వీడియోలో లోహై మల్హర్ గ్రామానికి చెందిన స్కూలు విద్యార్థిని ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడింది. వీడియో లింక్
ప్లీజ్ మోదీజీ అంటూ ప్రారంభమయ్యే ఈ వీడియోలో సీరత్ నాజ్ అనే బాలిక తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఆపై తమ స్కూలు పరిస్థితి గురించి ప్రధాని మోదీకి వివరిస్తుంది. స్కూలు ఆవరణ మొత్తం తిరుగుతూ మొబైల్ లో వీడియో తీసింది. నేలపై పేరుకుపోయిన దుమ్ముధూళిలోనే తాము కూర్చోవాల్సి వస్తోందని, యూనిఫాం మురికి కావడంతో ఇంట్లో అమ్మ తిడుతోందని చెప్పింది. మేం బాగా చదువుకోవడానికి ఓ మంచి స్కూలు కట్టివ్వరూ.. అంటూ ప్రధానిని అడిగిందా చిన్నారి. దేశం మొత్తం మీ మాట వింటుంది, మరి నా కోరిక నెరవేర్చండి అంటూ రిక్వెస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.