Asus ROG Phone 7: ఆసుస్ నుంచి గేమింగ్ ఫోన్.. రాగ్ ఫోన్ 7
- 1,500 నిట్స్ బ్రైట్ నెస్ డిస్ ప్లే
- 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ధర రూ.74,999
- రాగ్ ఫోన్ 7 అల్టిమేట్ పేరుతో మరో ఫోన్ విడుదల
- దీని ధర రూ.99,999
చాలా కాలం విరామం తర్వాత ఆసుస్ కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ తో భారత వినియోగదారుల ముందుకు వచ్చింది. రాగ్ 7 పేరుతో ఓ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఇది 5జీకి సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఎన్నో ఆకర్షణీయమైన హై ఎండ్ ఫీచర్లు ఉన్నాయి.
6.78 అంగుళాల డిస్ ప్లే, 1,500 నిట్స్ బ్రైట్ నెస్, 165 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. గేమింగ్ కారణంగా చార్జింగ్ త్వరగా ఖర్చయిపోతుంటుంది. అందుకని కొంచెం ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఏర్పాటు చేశారు. 65 వాట్ చార్జింగ్ కు బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. కానీ, బాక్స్ తో 33 వాట్ చార్జర్ ను ఆసుస్ ఇస్తోంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉన్నాయి. 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా కాగా, 13 మెగాపిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్, 6 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఉంటాయి.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ రెండో చిప్ సెట్ తో ఈ ఫోన్ వస్తుంది. రాగ్ ఫోన్ 7లోనే అల్టిమేట్ వెర్షన్ అని మరో వేరియంట్ కూడా వస్తుంది. ఇందులో ఏరో యాక్టివ్ కూల్ 7 సిస్టమ్ ఉంటుంది. ఫోన్ వేడిని ఎప్పటికప్పుడు బయటకు పంపించడం దీని ప్రత్యేకత. చిన్న ఎయిర్ ఇన్ లెట్ ఉంటుంది. దీని ద్వారా వేడిగాలిని బయటకు పంపుతుంది. ఫోన్ లో డ్యుయల్ ఫంట్ర్ స్పీకర్లు ఉన్నాయి. దీనికి తోడు ఏరో యాక్టివ్ కూలర్ 7 సిస్టమ్ కు అనుబంధంగా సబ్ వూఫర్ సిస్టమ్ కూడా ఉంది. ఐపీ 54 రేటెడెడ్ డస్ట్, వాటర్ నిరోధకం గుర్తింపు దీనికి లభించింది.
రాగ్ ఫోన్ 7 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.74,999. రాగ్ ఫోన్ 7 అల్టిమేట్ 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ.99,999. ఆసుస్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, విజయ్ సేల్స్, ఇతర ఆఫ్ లైన్, ఆన్ లైన్ దుకాణాల్లో ఇది లభిస్తుంది.