microwave oven: మైక్రోవేవ్ ఓవెన్ లో ఆహారం ఎంత వరకు సురక్షితం..?
- మైక్రోవేవ్ లో ఆల్టర్నేటివ్ కరెంట్ విడుదల
- ఇది సెల్ ఫోన్ల రేడియేషన్ మాదిరే
- పదార్థాలను వేడి చేసుకోవడం వరకైతే ఓకే
- ఓవెన్ లో ఉడికించుకోకుండా ఉంటే మంచిదంటున్న నిపుణులు
ఇదంతా మెషిన్ల యుగం. ఇంట్లో చాలా పనులకు యంత్రాలను ఉపయోగిస్తున్నాం. అలాంటి వాటిల్లో మైక్రోవేవ్ ఓవెన్ కూడా ఒకటి. చాలా సులభంగా, వేగంగా కావాల్సిన ఆహారాన్ని వేడి చేసి, ఉడికించి ఇస్తుంది. కానీ, మైక్రోవేవ్ ఓవెన్ లో తయారు చేసిన వాటిని ఉపయోగించే విషయంలో నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. పోషకాహార నిపుణురాలు అంజలీ ముఖర్జీ దీనికి సంబంధించి కీలక విషయాలను పంచుకున్నారు.
‘‘మైక్రోవేవ్ ఓవెన్లు ఆల్టర్నేటివ్ కరెంట్ ను ఉత్పత్తి చేస్తాయి. ఇది సెల్ ఫోన్లు విడుదల చేసే రేడియేషన్ మాదిరే. ఈ రేడియేషన్లు ఆహార మాలిక్యూల్స్ ను వైబ్రేట్ అయ్యేలా చేస్తాయి. ఈ ఘర్షణతో వేడెక్కేలా చేస్తుంది. ఈ వేడికి లోపల ఉంచిన ఆహారం ఉడకడం మొదలవుతుంది’’ అని వివరించారు. మాంసం, పాలను ఓవెన్ లో ఉంచినప్పుడు కార్సినోజెన్స్ ఏర్పడతాయి. దీంతో ఆహారంలోని పోషకాలకు నష్టం జరుగుతుంది. వేడి చేయడం వల్ల విటమిన్, మినరల్స్ కు నష్టం ఏర్పడుతుంది.
ఎలా వాడుకోవాలి..?
సౌకర్యం కోసం ఓవెన్ వాడుకోవాలని అనుకునే వారు కేవలం ఆహార పదార్థాలను కొంచెం వేడి చేసుకునేందుకు వాడుకోవచ్చని అంజలీ ముఖర్జీ సూచించారు. అంతేకానీ ఓవెన్ లో కుకింగ్ కు దూరంగా ఉండాలన్నారు. మైక్రోవేవ్ ఆన్ చేసిన తర్వాత రెండు అడుగుల దూరంలో ఉండాలని సూచించారు.