Elon Musk: చాట్ జీపీటీకి పోటీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఎలాన్ మస్క్
- ఎక్స్.ఏఐ కార్ప్ పేరిట కంపెనీ రిజిస్టర్ చేసిన ట్విట్టర్ అధినేత
- తానే ఏకైక డైరెక్టర్ గా నమోదు
- ఏఐని కొన్నాళ్లు నిలిపివేయాలని సంతకం చేసిన మస్క్
కనీసం ఆరు నెలల పాటు కృత్రిమ మేథ (ఏఐ) వ్యవస్థలను నిలిపివేయాలని పిలుపునిస్తూ బహిరంగ లేఖపై సంతకం చేసిన టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు సొంతంగా కొత్త కృత్రిమ మేధస్సు సంస్థను ఏర్పాటు చేయనున్నారు. మస్క్ తన ఏఐ సంస్థను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించాయి. ఎక్స్.ఏఐ కార్ప్ (X.AI Corp) అనే కొత్త కృత్రిమ మేధస్సు కంపెనీని స్థాపించనున్నారని తెలిపాయి. నెవాడాలో కేంద్రంగా పనిచేయనున్న ఈ కొత్త కంపెనీలో మస్క్ ఏకైక డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన కుటుంబ కార్యాలయాల డైరెక్టర్ జారెడ్ బిర్చాల్‌ను కార్యదర్శిగా పేర్కొంటూ రిజిస్టర్ అయింది.
కాగా, కృత్రిమ మేథస్సు (ఏఐ) అభివృద్ధి గురించి గతంలో ఆందోళన వ్యక్తం చేసిన మస్క్ తన కొత్త ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించడానికి శాస్త్రవేత్త ఇగోర్ బాబూస్కిన్‌తో సహా ఇద్దరు మాజీ పరిశోధకులను నియమించినట్లు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఎక్స్.ఏఐ కార్ప్ గురించి పూర్తి వివరాలు రహస్యంగా ఉంచినప్పటికీ మస్క్ ‘సత్యాన్ని అన్వేషించే’ ఏఐ మోడళ్లను రూపొందించడంపై దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రముఖ ఏఐ లాంగ్వేజ్ మోడల్ చాట్ జీపీటీకి పోటీగా దీటైన ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మస్క్ గతంలో చాట్ జీపీటీని విమర్శించారు. దీన్ని రాజకీయ పక్షపాతం కోసం, కొందరు వ్యక్తుల నియంత్రణ కోసం అభివృద్ధి చేశారని ఆరోపించారు. అణుబాంబుల కంటే ఏఐ ఎక్కువ ప్రమాదకరం అని, దీని బదులు అణ్వాయుధాలను తయారీకి అనుమతించడం ఉత్తమమని వాదించాడు.