VV Lakshminarayana: స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటు సంస్థ తరఫున బిడ్ వేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో పాల్గొన్న లక్ష్మీనారాయణ
- రెండు సీల్డ్ కవర్లలో బిడ్డింగ్ పత్రాలు సమర్పించిన వైనం
- రూ.850 కోట్లు సేకరించగలిగితే చాలన్న సీబీఐ మాజీ జేడీ
- ఎనిమిదన్నర కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 చొప్పున ఇచ్చినా సరిపోతుందని వెల్లడి
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన, అవసరమైతే బిడ్డింగ్ లో పాల్గొనేందుకైనా సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఓ ప్రైవేటు సంస్థ తరఫున బిడ్ వేశారు. రెండు సీల్డ్ కవర్లలో బిడ్డింగ్ కు అవసరమైన పత్రాలను లక్ష్మీనారాయణ అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా మూలధనం సేకరిస్తామని వెల్లడించారు. నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఇవ్వగలిగితే స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకుంటుందని అధికారులు చెప్పారని వివరించారు.
నాడు ఎన్టీఆర్ దివిసీమ ఉప్పెన, రాయలసీమ సంక్షోభం సందర్భంగా జోలె పట్టారని, అయితే ఇప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయని, ఇప్పుడన్నీ డిజిటల్ పేమెంట్లు వచ్చేశాయని వివరించారు. అయితే ఆన్ లైన్ లో నిధుల సేకరణ జరపవచ్చని, కానీ ఎవరి వద్ద ఎంత తీసుకున్నాం అనేదానికి జవాబుదారీ ఉండాలని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు నెలకు రూ.850 కోట్లు ఎలా సంపాదించాలన్నది తమ లక్ష్యమని, దీనిపై ఎలా ముందుకు పోవాలో ఆలోచిస్తున్నామని అన్నారు. ఈ ఆలోచన ప్రజల్లోకి వెళ్లడం చాలా అవసరం అని పేర్కొన్నారు. ఎనిమిదన్నర కోట్ల మంది నెలకు రూ.100 చొప్పున ఇవ్వగలిగితే రూ.850 కోట్లు సేకరించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. ఆ విధంగా నాలుగు నెలల పాటు ఇస్తే, స్టీల్ ప్లాంట్ యాజమాన్యంలో ప్రజలు కూడా భాగస్వాములవుతారని వివరించారు.
వేణుగోపాల్ అనే స్నేహితుడు ఇప్పటికిప్పుడు రూ.25 వేలు ఇస్తానని చెప్పాడని, నిధులు అందిస్తామని తనకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తమ బిడ్ ఆమోదం పొందుతుందన్న నమ్మకం ఉందని, ఒకవేళ తిరస్కరణకు గురైతే, ఎందుకు తిరస్కరించారన్న విషయంపై సదరు అధికార వర్గాలను, మంత్రిత్వ శాఖను సంప్రదిస్తామని, అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని లక్ష్మీనారాయణ చెప్పారు.
కాగా, స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో 22 బడా సంస్థలు పాల్గొనడంపైనా ఆయన స్పందించారు. బలిచక్రవర్తి అంతటివాడిని చిన్నవాడైన వామనుడు ఏంచేశాడో అందరికీ తెలుసని, తాము కూడా వామనుడి వంటి వారమని చమత్కరించారు.