Nara Lokesh: ​​​​పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఒక మహానటి: నారా లోకేశ్

Lokesh slams Pathikonda MLA Sridevi

  • పత్తికొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • రాంపల్లి సభలో పాల్గొన్న లోకేశ్
  • పత్తికొండ గడ్డపై నడవడం తన అదృష్టమన్న లోకేశ్
  • స్థానిక ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 71వరోజు డోన్ నియోజకవర్గం పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుండి ప్రారంభమైంది. ఎస్.రంగాపురం వద్ద లోకేశ్ వద్దకు మహిళలు వచ్చి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకున్నారు. సర్పంచ్ లు, డీసీ కొండ గ్రామస్తులు, కలచెట్ల గ్రామస్తులు తమ సమస్యలపై లోకేశ్ కు వినతిపత్రాలు అందించారు. వాటిపై లోకేశ్ స్పందించి తమ సమస్యలను అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు కదిలారు. 

శభాష్ పురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. నియోజకవర్గం ప్రారంభంలో పత్తికొండ టీడీపీ నాయకులు, కార్యకర్తలు యువనేతకు ఘనస్వాగతం పలికారు. మహిళలు పాదయాత్రకు పోటెత్తి తమ సంఘీభావం తెలిపారు  రాంపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. 

లోకేశ్ మాట్లాడుతూ... పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఓ మహానటి అని విమర్శించారు. ఆమె కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని మాఫియాలా దోచుకుతింటున్నారని ఆరోపించారు. దళితుల భూములను లాక్కుని, బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టించి వేధిస్తోందని మండిపడ్డారు. శ్రీదేవి దోపిడీకి హద్దులు లేకుండా పోతున్నాయని, పత్తికొండ అభివృద్ధి చెందాలంటే మరోసారి పత్తికొండలో పసుపుజెండా ఎగరాల్సిందేనని లోకేశ్ స్పష్టం చేశారు.

పత్తికొండపై నడవడం నా అదృష్టం!

అశోకుడు పరిపాలించిన ప్రాంతం పత్తికొండ అని లోకేశ్ వెల్లడించారు. వజ్రాల్లాంటి ప్రజలు పత్తికొండలో ఉన్నారని, నవ్యాంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడ నుండే ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. పెరవలి రంగనాథ స్వామి ఆలయం, పత్తికొండ సాయిబాబా ఆలయం ఉన్న పుణ్య భూమి ఇది అని కొనియాడారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న పత్తికొండలో పాదయాత్ర చెయ్యడం తన అదృష్టం అని పేర్కొన్నారు.

ఆర్.ఆర్.ఆర్ లో జగన్ నటిస్తే ఆస్కార్ వచ్చేది!

జగన్ ఒక గొప్ప డ్రామా ఆర్టిస్ట్... ఆర్ఆర్ఆర్ లో నటిస్తే ఆస్కార్ వచ్చేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. అందుకే జగన్ కి డ్రామా మోహన్ అని పేరు పెట్టానని వెల్లడించారు. "బాబాయ్ హత్య గురించి పెద్ద డ్రామా వేశాడు. ముందు గుండెపోటు అని ప్రకటించాడు. తరువాత నారాసుర రక్త చరిత్ర అన్నాడు, తరువాత అల్లుడూ, కూతురు కలిసి చంపేశారు అన్నాడు. ఆస్తి తగాదాలు అని ఒకసారి అన్నాడు, రెండో పెళ్లి వలనే మర్డర్ జరిగింది అని ఒకసారి కట్టుకథ అల్లాడు. సునీల్ యాదవ్ తల్లిపై కన్నేశాడు కాబట్టే మర్డర్ చేశారు అంటూ ఇంకో కథ అల్లారు. కానీ ఫైనల్ గా తేలింది ఏంటి? 

అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ ఎవరు అవినాష్ రెడ్డి అనుచరుడు. ఇప్పుడు చెప్పండి హూ కిల్డ్ బాబాయ్? అబ్బాయ్ కిల్డ్ బాబాయ్. అదీ జగనాసుర రక్త చరిత్ర. కోడి కత్తి అంటూ మరో డ్రామా వేశాడు. ఆఖరికి ఎన్ఐఏ ఏం చెప్పింది? కోడి కత్తి జగన్ డ్రామా తప్ప నిజం లేదని తేల్చేసింది. కోడి కత్తి లో కుట్ర లేదు మొత్తం జగన్ అల్లిన కథే అని ఎన్ఐఏ తేల్చేసింది" అని వివరించారు. 

పత్తికొండలో శ్రీదేవి దోపిడీ ఫుల్... అభివృద్ధి నిల్!

"పత్తికొండ ఎమ్మెల్యే గారి పేరు శ్రీదేవి గారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని మీరు భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ జరిగింది ఏంటి? నియోజకవర్గాన్ని, ప్రజల్ని గాలికి వదిలేసి ఫ్యామిలీ మాఫియాని రంగంలోకి దింపారు. ఆమె నేను నియోజకవర్గంలోకి రాకముందే నా అవినీతి గురించి మాట్లాడొద్దు అని ప్రెస్ మీట్ పెట్టారు. నేను మాట్లాడనంత మాత్రాన మీరు చేసిన అవినీతి మాయం అవుతుందా శ్రీదేవి గారు? 

ప్రతి రోజూ సాయంత్రం ఫ్యామిలీ మాఫియా మొత్తం కూర్చొని వాటాలు వేసుకుంటారు. పత్తికొండని కేకు ముక్కల్లా కోసి ఫ్యామిలీ మాఫియాకు పంచేశారు శ్రీదేవి గారు. శ్రీదేవి గారి కొడుకు రామ్మోహన్ రెడ్డి, బంధువులు ప్రదీప్ రెడ్డి, జగన్నాథ రెడ్డిలకు ఒక్కో మండలాన్ని పంచేశారు. ఇసుక, మట్టి, అక్రమ మద్యం రవాణా, భూకబ్జాలకు పాల్పడుతూ ఫ్యామిలీ మాఫియా పత్తికొండను దోచుకుంటుంది. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల వరకు, సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల నియామకం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.12 లక్షలు తీసుకున్నారు. 

జగన్ పాదయాత్రలో పత్తికొండకి వచ్చినప్పుడు నియోజకవర్గంలోని చెరువులు నింపి నియోజకవర్గానికి నీటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. శ్రీదేవి గారు ఆ హామీ ఏమైంది? టమోటా జ్యూస్ ఫాక్టరీ ఏర్పాటు చేస్తాం అన్నారు. శ్రీదేవి గారు ఆ హామీ ఏమైంది? పత్తికొండను అభివృద్ధి చేసింది టీడీపీ. సాగు, తాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, పేదలకు టిడ్కొ ఇళ్లు, పాఠశాల భవనాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది టీడీపీ. టీడీపీ హయాంలో 1600 కోట్లు ఖర్చు చేసి పత్తికొండని అభివృద్ది చేసింది టీడీపీ.  

యువనేతను కలిసిన సర్పంచుల సంఘం ప్రతినిధులు

పత్తికొండ నియోజకవర్గం గుడిసె గుప్పరాలలో సర్పంచ్ ల సంఘం ప్రతినిధులు లోకేశ్ ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థను సర్పంచుల అధీనంలోకి తీసుకురావాలని, పంచాయతీలకు చెందాల్సిన నిధులను సీఎఫ్ఎంఎస్ – పీడీ అకౌంట్ల నుంచి రాష్ట్రప్రభుత్వం తమకు చెప్పకుండా ప్రభుత్వ పథకాలకు మళ్లిస్తోందని వెల్లడించారు. 

"2022-23 ఆర్థికసంవత్సరానికి కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులు వెంటనే పంచాయతీలకు ఇవ్వాలి. గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం ఇస్తున్న రూ.20 లక్షల నిధులను ఎమ్మెల్యే ద్వారా కాకుండా సర్పంచ్ ల ద్వారా అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. పంచాయితీల విద్యుత్ బిల్లులు, క్లాప్ మిత్రుల జీతాలు పాతపద్ధతిలోనే రాష్ట్రప్రభుత్వం చెల్లించాలి. జాతీయ ఉపాధి పథకం నిధులను ఉపాధి హామీ చట్టం ప్రకారం గతంలో మాదిరి సర్పంచ్ లకు ఇవ్వాలి. సర్పంచ్, ఎంపీటీసీలకు రూ.15వేలు, ఎంపీపీ, జడ్ పీటీసీ లకు రూ.30వేలు గౌరవవేతనం చెల్లించాలి" అని వివరించారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించిన అధికారాలను సమాంతర వ్యవస్థల ద్వారా జగన్ ప్రభుత్వం హైజాక్ చేసిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన రూ.7,880 కోట్ల నిధులను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగిలించిందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు నిధులు ఇచ్చి బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ ల గౌరవ, ప్రతిష్ఠ పెంచేలా వారికి 73,74 రాజ్యాంగ సవరణల ప్రకారం అధికారాలు ఇస్తామని తెలిపారు.

లోకేశ్ ను కలిసిన దివ్యాంగుల సమాఖ్య సభ్యులు

పత్తికొండ నియోజకవర్గం, పెద్దకొండ వద్ద తుగ్గలి వెన్నెల దివ్యాంగుల సమాఖ్య సభ్యులు లోకేశ్ ను కలిసి సమస్యలు విన్నవించారు. "ఈ ప్రభుత్వం రద్దు చేసిన వికలాంగ కార్పొరేషన్ ను పునఃప్రారంభించాలి. గత ప్రభుత్వంలో మంజూరైన రుణాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దివ్యాంగులను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బధిరుల కోసం సైగల భాష, సబ్ టైటిల్స్ తో టీవీ కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యా, ఉద్యోగాల్లో 5శాతం రిజర్వేషన్లు కల్పించాలి. గృహాల కేటాయింపుల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఉచితంగా న్యాయ సహాయం అందించాలి. దివ్యాంగులను కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని విజ్ఞప్తి చేశారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ.... దివ్యాంగుల పెన్షన్ ను రూ.3 వేలు చేసిన ఘనత చంద్రబాబుది అని వెల్లడించారు. పెన్షన్ల పెంపులో దివ్యాంగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 

"దివ్యాంగులను వివాహం చేసుకున్నవారికి రూ.లక్ష ప్రోత్సాహంగా అందించాము. దాన్ని లక్షన్నరకు పెంచుతామన్న జగన్, ఆ పని చేయకుండా మోసం చేశారు. కదల్లేని పరిస్థితుల్లో ఉన్నవారికి యాక్టివా స్కూటర్లు కూడా పంపిణీ చేశాం. స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల దాకా రుణాలిచ్చాం. దివ్యాంగులను ఎవరైనా కించపరిచితే అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం. దివ్యాంగులు ఆత్మగౌరవంతో  బతికేలా చేస్తాం. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. విద్యా, ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పిస్తాం" అని హామీ ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 917.6 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 14.7 కి.మీ.*

*72వరోజు (16-4-2023) యువగళం వివరాలు:*

*పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

7.00 – రాంపిల్లి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.00 – రాంపిల్లిలో మహిళలతో సమావేశం.

9.30 – ఆర్ఎస్ పెండేకల్లులో స్థానికులతో భేటీ.

9.50 – రాంకొండ క్రాస్ వద్ద యువకులతో సమావేశం.

11.15 – మారెళ్లలో రైతులతో సమావేశం.

11.55 – మారెళ్ల శివార్లలో బీసీలతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.55 – మారెళ్ల శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – మారెళ్ల శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.30 – నల్లగుండ్లలో తాండా మహిళలతో సమావేశం.

7.10 – ఆలూరు నియోజకవర్గంలోకి ప్రవేశం. ఎం.కె కొట్టాల వద్ద స్థానికులతో మాటామంతీ.

7.20 – ఎం.కె కొట్టాల వద్ద విడిది కేంద్రంలో బస.


  • Loading...

More Telugu News