Gangster Ateeq: గ్యాంగ్ స్టర్ అతీక్ ను కాల్చి చంపిన కారణం చెప్పిన నిందితులు
- యూపీలోని ప్రయాగ్ రాజ్ ఆసుపత్రిలో అతీక్, అతని సోదరుడు అష్రాఫ్ హత్య
- పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి హత్య చేసిన ముగ్గురు నిందితులు
- ఫేమస్ అయ్యేందుకు కాల్చి చంపినట్టు పోలీసుల విచారణలో వెల్లడి
ఉత్తర్ ప్రదేశ్ బడా గ్యాంగ్ స్టర్, రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతీక్ అతని సోదరుడు అష్రాఫ్ ను పోలీసులు, మీడియా ప్రతినిధుల ముందే ముగ్గురు దుండగులు నిన్న రాత్రి ప్రయాగ్ రాజ్ లోని వైద్య కళాశాలలో పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చి చంపారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఇద్దరిపై తూటాల వర్షం కురిపించారు. దాంతో, అతీక్, అష్రాఫ్ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారిపై కాల్పులు జరిపిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వారిని లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు. పక్కా పథకం ప్రకారం వీళ్లు హత్యలకు పాల్పడారు. మీడియా ఐడీ కార్డులు ధరించి ఆసుపత్రిలోకి వచ్చిన వీరిని పోలీసులు విచారించారు. హత్యలకు కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలో తాము ఫేమస్ అయ్యేందుకే ఈ హత్యలు చేసినట్టు పోలీసులకు తెలిపారు. అయితే, హత్యలకు వేరే కారణం ఏదైనా ఉందా? నిందితుల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.