Cricket: ధోనీ రికార్డు బద్దలు కొట్టిన పాక్ కెప్టెన్ బాబర్
- కెప్టెన్ గా 42 విజయాలు సాధించిన బాబర్
- 41 విజయాలతో ఉన్న ధోనీని అధిగమించిన పాక్ కెప్టెన్
- రెండో టీ20లో న్యూజిలాండ్ పై పాక్ ఘన విజయం
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. లాహోర్ వేదికగా శనివారం రాత్రి న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్ గా బాబర్ కు ఇది 42వ విజయం. దాంతో, టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. ధోనీ 41 టీ20ల్లో భారత్ ను గెలిపించాడు. బాబర్ తో పాటు ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్, ఆఫ్ఘానిస్థాన్ అస్గర్ స్టానిక్ జాయ్ కూడా చెరో 42 విజయాలు సాధించారు.
కాగా, కివీస్ తో రెండో టీ20లో బాబర్ (101) సెంచరీ, రిజ్వాన్ (50) అర్ధ శతకంతో విజృంభించడంతో పాక్ తొలుత 192/4 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓవర్లన్నీ ఆడి 154/7 స్కోరు మాత్రమే చేసి ఓడిపోయింది. మార్క్ చాప్ మన్ (64 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బాబర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.