btech ravi: ఇవి చిన్న చేపలే.. పెద్ద చేపలు తాడేపల్లిలో ఉన్నాయి.. టీడీపీ నేత బీటెక్ రవి వ్యాఖ్యలు
- వివేకా కుమార్తె సునీత పోరాటానికి కొంత న్యాయం జరిగిందన్న బీటెక్ రవి
- భాస్కర్ రెడ్డి, ఇతరులు ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని సూచన
- రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయటంపై పులివెందుల టీడీపీ ఇన్ చార్జ్ బీటెక్ రవి స్పదించారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి చిన్న చేపలు మాత్రమేనని.. పెద్ద చేపలు తాడేపల్లిలో ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజు వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లిలో మీడియాతో బీటెక్ రవి మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత పోరాటానికి ఈరోజు కొంత న్యాయం జరిగినట్లు అనిపించిందని చెప్పారు. భాస్కర్ రెడ్డి, ఇతరులు ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని అన్నారు.
భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై ఎవరూ రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని టీడీపీ శ్రేణులకు బీటెక్ రవి సూచించారు. ‘‘వివేకానందరెడ్డి వాళ్ల మనిషి. వాళ్లు ఏమైనా చేసుకోని.. ఇప్పుడు జైలుకు వెళ్లేదాకా తెచ్చుకున్నారు. దీని వల్ల మనం (టీడీపీ) సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. సంతోషించాల్సిన పని లేదు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. సంయమనం పాటించండి’’ అని కోరారు. పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయన్నారు.