Bathinda: బఠిండాలో నలుగురు జవాన్లను చంపింది తోటి సైనికుడే!
- మిలటరీ స్టేషన్ లో కాల్పుల ఘటనలో ట్విస్ట్
- పంజాబ్ పోలీసుల విచారణలో బయటపడ్డ అసలు విషయం
- వ్యక్తిగత కక్షతోనే కాల్పులు జరిపినట్లు అంగీకరించిన జవాన్
- ముసుగు వ్యక్తుల పనేనంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన వైనం
బఠిండా ఆర్మీ స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తోటి సైనికుడే ఈ కాల్పులకు తెగబడ్డాడని, వ్యక్తిగత కక్షతోనే నలుగురిని చంపేశాడని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ముసుగు వ్యక్తుల పనేనంటూ విచారణను తప్పుదోవ పట్టించేందుకు హంతకుడు ప్రయత్నించాడని తెలిపారు. మరింత లోతుగా విచారించడంతో అసలు విషయం బయటపెట్టాడని చెప్పారు.
దీంతో హంతకుడిని సోమవారం అరెస్టు చేశామని బఠిండా ఎస్పీ గుల్నీత్ సింగ్ ఖురానా మీడియాకు వివరించారు. దేశంలోనే అతిపెద్ద, కీలకమైన మిలటరీ స్థావరం బఠిండాలో ఈ నెల 12న కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తమ టెంట్ లో నిద్రిస్తున్న నలుగురు జవాన్లపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో నలుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రాథమిక విచారణలో ఇద్దరు ముసుగు వ్యక్తులు ఆ టెంట్ నుంచి బయటకు రావడం చూశానని మోహన్ దేశాయ్ అనే జవాను వెల్లడించాడు. దీనిపై పంజాబ్ పోలీసులు మరింత లోతుగా విచారించారు. అనుమానితులు నలుగురు జవాన్లతో పాటు దేశాయ్ ను కూడా ప్రశ్నించారు. దీంతో ఆ నలుగురు జవాన్లను చంపింది తానేనని దేశాయ్ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. దీంతో దేశాయ్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.