Harish Rao: ఏపీ మేలు కోరి మాట్లాడానే తప్ప అక్కడి ప్రజలను తిట్టలేదు: హరీశ్ రావు
- ఏపీ అభివృద్ధి కోసం మాట్లాడానన్న హరీశ్ రావు
- తెలంగాణలో పథకాలు బాగున్నాయని చెప్పానే తప్ప తప్పుగా మాట్లాడలేదని వెల్లడి
- ఏపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించానని వివరణ
- కానీ కొందరు ఏపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని ఆగ్రహం
తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మండిపడుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హరీశ్ రావు స్పందించారు. తెలంగాణలో అన్ని పథకాలు బాగున్నాయని చెప్పానే తప్ప ఒక్క మాట కూడా తప్పు మాట అనలేదని తెలిపారు. ఈ క్రమంలో ఏపీ అభివృద్ధి కోసం మాట్లాడానే తప్ప అక్కడి ప్రజలను తిట్టలేదని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కుపై మౌనం ఎందుకని ప్రశ్నించానని వెల్లడించారు. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. కానీ కొందరు ఏపీ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు. ఏపీ నేతలకు చేతనైతే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కుపై పోరాడండి... అంతేకానీ మాపై కాదు అని హితవు పలికారు.
సిద్ధిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చారు.