Avinash Reddy: అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
- వివేకా హత్య కేసులో సహనిందితుడిగా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి
- తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవినాశ్
- అవినాశ్ రెడ్డిని రేపు సాయంత్రం విచారణకు పిలవాలని సీబీఐకి సూచన
- హైకోర్టు సూచనకు సీబీఐ అంగీకారం
వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ బెయిల్ పిటిషన్ పై నేటి మధ్యాహ్నం తర్వాత విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. అవినాశ్ రెడ్డిని రేపు సాయంత్రం విచారణకు పిలవాలని సీబీఐకి సూచించింది. కోర్టు సూచన మేరకు, అవినాశ్ రెడ్డిని రేపు సాయంత్రం 4 గంటలకు విచారించేందుకు సీబీఐ అంగీకారం తెలిపింది. అనంతరం, తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నేపథ్యంలో, అవినాశ్ పిటిషన్ పై రేపు ఉదయం మరోసారి విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. కాగా, రేపు మధ్యాహ్నం లోపు అవినాశ్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం ఉంది.