annamalai: రూ.500 కోట్లకు డీఎంకే పంపిన లీగల్ నోటీసులపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కౌంటర్
- స్టాలిన్, ఇతర నేతలపై అన్నామలై చేసిన ఆరోపణలకు నోటీసులు
- డీఎంకే కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
- డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ భారతికి నోటీసులు పంపిన అన్నామలై
- 48 గంటల సమయం ఇస్తున్నానని వ్యాఖ్య
డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలపై... తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అధికార పార్టీ... రూ.500 కోట్ల నష్టపరిహారం చెల్లించడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై అన్నామలై సోమవారం స్పందించారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలకు తాను సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటనను విడుదల చేశారు.
తనపైన నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను డీఎంకే కూడా అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. గతంలో డీఎంకే హయాంలో మెట్రో రైలు ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వీటిని సీబీఐకి అప్పగిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో జోక్యం చేసుకున్న వారికి సీబీఐ నోటీసులు వచ్చేంత వరకు ఓపికతో వేచి చూడాలన్నారు. అంతేకాదు, తనకు నోటీసులు జారీ చేసిన డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఆర్ఎస్ భారతికి ప్రతి నోటీసులు పంపించారు అన్నామలై.
డీఎంకే నేత భారతి నిన్న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన పైన అసత్య ఆరోపణలు చేశారని, తనకు ఆరుద్ర ప్రయివేట్ కంపెనీ నుండి రూ.84 కోట్ల లంచం అందిందని అవాస్తవాలు చెప్పారని మండిపడ్డారు. తనపైనా, తమ పార్టీ పైనా అసత్య ఆరోపణలు చేసినందుకు గాను రూ.501 కోట్ల నష్టపరిహారం కోరుతూ నోటీసులు పంపిస్తున్నానని చెప్పారు. తనకు వచ్చే ఈ మొత్తాన్ని తాను పీఎం కేర్స్ ఫండ్ కు సమర్పిస్తానన్నారు. అసత్య ఆరోపణలపై 48 గంటల్లో తనకు వివరణ ఇవ్వాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అలాగే, మీరు పంపిన లీగల్ నోటీసులకు సంబంధించి తాను వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
డీఎంకే ఫైల్స్ పేరుతో అన్నామలై తమపై అసంబద్ధ ఆరోపణలు చేశాడని డీఎంకే నిన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు గాను తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు తమ పరువుకు నష్టం కలిగించినందుకు గాను రూ.500 కోట్ల పరిహారం చెల్లించాలని నోటీసులు పంపించారు భారతి. వీటిపై నేడు అన్నామలై ఎదురు దాడికి దిగారు.