BTech Ravi: టీడీపీ నేత బీటెక్ రవికి గన్ మన్ల తొలగింపు
- మార్చి 29తో ఎమ్మెల్సీగా ముగిసిన బీటెక్ రవి పదవీకాలం
- ఇద్దరు గన్ మన్లు వెనక్కి రావాలని ఆదేశించిన అధికారులు
- భద్రత తొలగింపుపై బీటెక్ రవి అసంతృప్తి
- ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని వెల్లడి
టీడీపీ నేత బీటెక్ రవికి భద్రత తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ రవి గన్ మన్లను ఉపసంహరించుకుంది. ఇద్దరు గన్ మన్లు వెనక్కి రావాలని వైఎస్సార్ కడప జిల్లా పోలీసు అధికారులు ఆదేశించారు. ఎమ్మెల్సీగా బీటెక్ రవి పదవీకాలం మార్చి 29తో ముగిసింది. బీటెక్ రవి పదవీకాలం ముగియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, తనకు భద్రత తొలగించడంపై బీటెక్ రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన గన్ మన్లను వెనక్కి పిలిపించడాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కడప జిల్లా టీడీపీ నేతల్లో బీటెక్ రవి అత్యంత ముఖ్యుడు. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా బీటెక్ రవి వ్యవహరిస్తున్నారు.