Indian Railways: డౌన్ లోడ్ చేయకండి: ఫేక్ యాప్‌పై రైల్వే శాఖ హెచ్చరిక
- నకిలీ ఐఆర్‌సీటీసీ యాప్ సర్క్యులేట్
- ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు చెప్పవద్దు
- గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి
irctcconnect.apk ఆండ్రాయిడ్ యాప్ నకిలీదని, ఇలాంటి వాటి పట్ల భారతీయ రైల్వే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది IRCTC. వీటికి బదులుగా గూగుల్ ప్లే, యాపిల్ స్టోర్ నుండి IRCTC రైల్ కనెక్ట్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చునని సూచించింది. IRCTC ని పోలిన నకిలీ యాప్... వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ యాప్స్ లో సర్క్యులేట్ అవుతోందని, దానిని డౌన్ లోడ్ చేసుకోవద్దని అప్రమత్తం చేసింది. ఏపీకే ఫైల్ రూపంలో ఉన్న ఆ యాప్ ను ఒకవేళ ఎవరైనా ఇప్పటికే తమ తమ మొబైల్ ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకుంటే ఇబ్బందులు ఉంటాయని హెచ్చరించింది. ఈ ఫేక్ యాప్ మీ పరికరాలకు హాని కలిగిస్తుందని తెలిపింది.
irctcconnect.apk పేరిట ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఒకటి షేర్ అవుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఈ యాప్ ద్వారా మోసగాళ్లు అక్రమ లింక్స్ ను పంపించి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచనలు చేస్తుంటారని, ఈ యాప్ ను కనుక ఇప్పటికే ఎవరైనా డౌన్ లోడ్ చేసుకుని ఉంటే మీ విలువైన సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సమాచారం దొంగిలించే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. ఈ యాప్ కు దూరంగా ఉండాలని తెలిపింది. ఫోన్ ద్వారా పిన్, ఓటీపీ, క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతా సహా పలు వివరాలను ఈ యాప్ అడగదని IRCTC స్పష్టం చేసింది.