Ushodya Publications: వాలంటీర్లు దినపత్రిక కొనాలన్న జీవోలపై ఉషోదయ పిటిషన్... సుప్రీంలో విచారణ
- రూ.200తో దినపత్రిక కొనాలన్న ఏపీ ప్రభుత్వం
- కేసు విచారణ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం
- ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందన్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది
- అలాంటి అభిప్రాయానికి తావులేకుండా ఉత్తర్వులు ఇస్తామన్న సీజేఐ
ఏపీలో వాలంటీర్లు దినపత్రిక కొనుగోలు చేయాలన్న జీవోలను సవాలు చేస్తూ ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సీజేఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.200తో ప్రతి నెల దినపత్రిక కొనాలని ఏపీ ప్రభుత్వం రెండు జీవోలు ఇచ్చింది. దీనిపై ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
వాదనల సందర్భంగా... ఏపీ హైకోర్టులో విచారణకు సిద్ధమని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తే ఏపీ హైకోర్టుపై నమ్మకం పోతుందని వాదించారు.
అందుకు సీజేఐ ధర్మాసనం స్పందిస్తూ... అలాంటి తేలికపాటి అభిప్రాయానికి తావులేకుండానే ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. కేసు విచారణ అర్హతల విషయంలోకి వెళ్లడంలేదని తెలిపింది. కేసుపై తుది విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టుకు సూచిస్తున్నట్టు పేర్కొంది.