Nara Lokesh: ఆలూరులో టీడీపీ గెలవకపోయినా చంద్రబాబు చిన్నచూపు చూడలేదు: లోకేశ్

Lokesh Yuvagalam Padayatra continues in Aluru constituency

  • కర్నూలు జిల్లాలో యువగళం
  • ఆలూరు నియోజవకర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • రైతులతో ముఖాముఖి

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఆలూరు నియోజకవర్గం ఎంకే కొట్టాల నుంచి 73వ రోజు పాదయాత్ర ప్రారంభం కాగా, దారిపొడవునా ఘనస్వాగతం లభించింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఆలూరు నియోజకర్గ ప్రజలు లోకేశ్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. గుడిమిర్ల శివార్లలో గొర్రెల కాపర్లను కలిసిన లోకేశ్ వారి సమస్యలను తెలుసుకున్నారు. 

వెంకటాపురం వద్ద రైతులతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకాలు విన్నారు. కర్నూలు జిల్లా ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం అన్నివర్గాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి యువనేత ముందుకు సాగారు. 

జగన్ పాలనలో సంక్షోభంలో వ్యవసాయం

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం, వెంకటాపురంలో రైతులతో యువనేత లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... వేదావతి ప్రాజెక్టును 8 టీఎంసీల సామర్థ్యంతో పనులు చేపడితే ఈ ప్రభుత్వం 4 టీఎంసీలకు తగ్గించడమే కాకుండా పనులు చేపట్టలేదని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే పనుల్లో వేగం పెంచి సామర్థ్యం మళ్లీ 8 టీఎంసీలకు పెంచుతామని స్పష్టం చేశారు. 

"ఆలూరులో టీడీపీ గెలవకపోయినా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చిన్నచూపు చూడలేదు. నగరడోన ప్రాజెక్టుకు భూసేకరణ కూడా చేశాం. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆలూరులో టీడీపీని ఆదరించండి, వేదావతి, నగరడోన ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తాం. ప్రతి ఇంటికీ తాగు నీరందించే బాధ్యత తీసుకుంటాం. టమోటాకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం" అని హామీ ఇచ్చారు. 

జగన్ పాలనలో సీమరైతులకు అన్యాయం

"సీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ సీమ రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశాడు. నామమాత్రం సబ్సీడీతో నాసిరకం డ్రిప్ ఇస్తున్నారు. మోటార్లకు మీటర్ల అగ్రిమెంట్లపై సంతకం పెట్టొద్దు. మీరు పగలగొట్టండి.. మీకు అండగా మేముంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ మంత్రి కాకాణి కోర్టు దొంగ. రైతుల దగ్గరకు ఏనాడైనా మంత్రి వచ్చాడా? బీమా సొమ్ము రైతులకు ఇవ్వాలన్న దానిపై సీఎం ఏనాడూ సమీక్షించలేదు. మేమొచ్చాక పాత బీమా విధానాన్ని ప్రవేశపెడతాం"

కర్నూలు జిల్లాలో ప్రతి ఎకరాకు నీరిస్తాం

"టీడీపీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కర్నూలు జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరిస్తాం. గోదావరి మిగులు జలాలను సీమకు తెస్తే ఇక్కడి రైతులు బంగారం పండిస్తారు. సీమలో పాదయాత్ర పూర్తయ్యాక సుదీర్ఘంగా చర్చించి రాయలసీమకు ఏం చేయాలనేది మేనిఫెస్టోలో పెడతాం. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు నష్టపోతున్నారు. గతంలో ఖరీఫ్ సీజన్ లో 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం సేకరిస్తే జగన్ ప్రభుత్వం కేవలం 35 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించింది. పైగా ఇంకా రైతులకు ధాన్యం బకాయిలు పూర్తిగా చెల్లించలేదు"

రబీలో ధాన్యం పరిస్థితి ఏమిటి?

"రబీలో జగన్ ప్రభుత్వం అసలు ధాన్యం కొనుగోలు పాలసీనే ప్రకటించలేదు. ఎంత ధాన్యం కొంటారో చెప్పలేని దుస్థితి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో రబీలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటే... కేవలం 2.5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనడానికి ప్రభుత్వం సిద్దం అవుతుంది. పైగా డబ్బులు లేవని చెబుతుంది. దీని వలన వ్యాపారస్తులు అంతా సిండికేట్ అయ్యే ప్రమాదం ఉంది. మొదట ఎవరు వస్తే వారి ధాన్యం మాత్రమే కొంటాము అనే ప్రభుత్వ విధానం కరెక్ట్ కాదు. రైతులందరి దగ్గరా ప్రభుత్వం ధాన్యం సేకరించాలి"

ఎమ్మెల్యే శ్రీదేవి బాధితుడ్ని అంటూ లోకేశ్ ను కలిసిన వ్యక్తి

పత్తికొండ నియోజకవర్గం అల్లుగుండు గ్రామానికి చెందిన ఊరవాకిలి వెంకటేశ్ అనే వ్యక్తి  లోకేశ్ ను కలిసి తమ సమస్యను విన్నవించాడు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుడు తన 3.55 ఎకరాల భూమిని కబ్జా చేశాడని, తమ భూమి తమకు ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు. 

"మా ముత్తాత ఊరవాకిలి బోడెన్న 1960 లో సర్వే నంబర్ 207/1 లో 3.55ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, మా నాన్నవాళ్లకు వంశపారంపర్యంగా ఆ పొలం వచ్చింది. ఆ పొలాన్ని మా గ్రామంలోని ఊరవాకిటి పుల్లన్నకు 10ఏళ్ల క్రితం కౌలుకు ఇచ్చారు. 2018 నుండి పుల్లన్న కౌలు ఇవ్వడం ఆపేశాడు. ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే, పొలం నాదని అడ్డం తిరిగాడు. 

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పొలానికి సంబంధించి పట్టాపాస్ పుస్తకాన్ని దొంగపత్రాలు సృష్టించాడు. దీనిపై నా తండ్రి రాతపూర్వకంగా వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ పుల్లన్న నాపైన, నాతండ్రిపైన పోలీస్ స్టేషన్ లో రివర్స్ కేసుపెట్టి మమ్మల్ని పోలీసులతో కొట్టించారు. ఊరవాకిటి పుల్లన్నకు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్యే కొడుకు రామ్మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు అండగా నిలబడ్డారు. మా భూమికోసం మేం కోర్టుకు వెళ్లగా, డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కోర్టులో కేసు నడుస్తున్నా భూమిలో పుల్లన్న ప్లాట్లు వేసి, అమ్మేందుకు ప్రయత్నించాడు. 

మేం కర్నూలుజిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే సివిల్ కేసులతో మాకు సంబంధం ఉండదు కోర్టులో తేల్చుకోండని పంపేశారు. కేసు కోర్టులో నడుస్తున్న సమయంలో నా తండ్రి 2022 ఏప్రిల్ 29న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కేసు నా తండ్రిపేరు మీదే నడుస్తోంది. మా పెదనాన్న వాళ్లు ఎమ్మెల్యేకు భయపడి మాకు సహకరించడం లేదు. మా పొలాన్ని ఆక్రమించినవాళ్లు మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాకు పొలం తప్ప వేరే జీవనాధారం లేదు, మా పొలాన్ని మాకు ఇప్పించి ఆదుకోండి" అని విజ్ఞప్తి చేశాడు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులకు రక్షణ కరవైందని అన్నారు. "ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేటు ఆస్తులను కూడా వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల భూకబ్జాలపై సిట్ ఏర్పాటుచేసి, బాధితులకు న్యాయం చేస్తాం. వైసిపి నేతలు ఆక్రమించిన పేదల భూములను తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం" అని భరోసా ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 948 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15 కి.మీ.*

*74వరోజు (18-4-2023) యువగళం వివరాలు:*

*ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)*

ఉదయం

7.00 – పల్లెదొడ్డి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.30 – పల్లెదొడ్డిలో స్థానికులతో సమావేశం.

8.25 – గద్దెరాలలో స్థానికులతో సమావేశం.

10.05 – దేవరకొండ ఎన్టీఆర్ విగ్రహం వద్ద బిసిలతో సమావేశం.

10.20 – దేవరకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులతో సమావేశం.

11.30 – దేవరకొండ క్రాస్ వద్ద టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులతో భేటీ.

మధ్యాహ్నం

12.25 – కుంకనూరు క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

12.40 – కుంకనూరు క్రాస్ వద్ద భోజన విరామం.

సాయంత్రం

3.35 – కుంకనూరు క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.05 – అల్లారుదిన్నె వద్ద కురుబ సామాజికవర్గీయులతో భేటీ.

5.30 – వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభ. యువనేత లోకేష్ ప్రసంగం.

6.30 – వలగొండ క్రాస్ వద్ద విడిది కేంద్రంలో బస.

  • Loading...

More Telugu News