Jagtial: ఆపరేషన్ చేసి కడుపులో క్లాత్ మరిచిన వైద్యులు.. జగిత్యాలలో దారుణం
- తిండి తినలేక, తిన్నది జీర్ణంకాక మహిళ అవస్థలు
- పదహారు నెలల పాటు నరకం అనుభవించిందన్న కుటుంబ సభ్యులు
- మరోమారు ఆపరేషన్ చేసి క్లాత్ బయటకు తీసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు
డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళకు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. ఆపై కుట్లువేసి చికిత్స చేసి ఇంటికి పంపించారు. రోజూ కడుపు నొప్పి బాధిస్తున్నా డెలివరీ తర్వాత సాధారణమేనని భావించింది. అయితే, ఏడాది గడిచినా నొప్పి తగ్గకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.. ఆమె కడుపులో ఓ క్లాత్ మరిచిపోయి కుట్లు వేశారని స్కానింగ్ లో తేలింది.
జగిత్యాల జిల్లాకు చెందిన నవ్య 16 నెలల క్రితం డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేసిన వైద్యులు.. నిర్లక్ష్యంతో ఓ క్లాత్ ను ఆమె కడుపులోనే మరిచిపోయారు. వారం పాటు చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత నవ్యకు ఇబ్బందులు మొదలయ్యాయి. తిన్న అన్నం జీర్ణం కాక కడుపునొప్పితో రోజూ అవస్థ పడేది. ఆమె పరిస్థితిని చూసి కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు.
ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నవ్యను చూపించారు. కడుపునొప్పికి కారణం గుర్తించేందుకు వైద్యులు స్కానింగ్ చేయగా.. నవ్య కడుపులో ఓ క్లాత్ ఉన్నట్లు తేలింది. దీంతో మరోమారు నవ్యకు ఆపరేషన్ చేసి క్లాత్ ను బయటకు తీశారు. అయితే, ఈ క్లాత్ సాధారణంగా ఆపరేషన్ థియేటర్లలో ఉండే క్లాత్ కాదని, అది ఆపరేషన్ థియేటర్లోకి ఎలా వచ్చిందని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతపెద్ద క్లాత్ ను నవ్య కడుపులో మరిచిపోయారంటే శస్త్రచికిత్స సమయంలో వైద్యులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారోనని విమర్శిస్తున్నారు.