Ajinkya Rahane: ఇటు భారీ సిక్స్.. అటు కళ్లు చెదిరే ఫిల్డింగ్.. అదరగొట్టిన రహానే
- లేకలేక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న రహానే
- బెంగళూరుతో మ్యాచ్ లో భారీ సిక్స్.. చిన్నస్వామి స్టేడియం పైకప్పుపై పడ్డ బంతి
- ఫీల్డింగ్ లో సిక్స్ ను అడ్డుకునేందుకు అద్భుత విన్యాసం
ఫామ్ కోల్పోయి జాతీయ జట్టుకు దూరమయ్యాడు సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే. చాలా రోజుల తర్వాత ఈ ఐపీఎల్ లో లేకలేక వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తనకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చోటు కల్పించిన ధోనీ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. అటు బ్యాటింగ్ తో, ఇటు ఫీల్డింగ్ తో అదరగొడుతున్నాడు.
మొన్న ముంబైపై జరిగిన మ్యాచ్ లో 27 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు చేశాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రహానే.. బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండో వికెట్‌కు డేవన్ కాన్వేతో కలిసి 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే రహానే కొట్టిన తొలి సిక్సర్ ఏకంగా చిన్నస్వామి స్టేడియం పైకప్పుపై పడింది. దాన్ని బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ అలా చూస్తుండిపోయాడు.
ఫీల్డింగ్‌లో కూడా రహానే అద్భుత విన్యాసం చేశాడు. బెంగళూరు బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొట్టిన బంతిని సిక్స్ వెళ్లకుండా ఆపాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి.. తను కింద పడే ముందే బంతిని మైదానం లోపలికి విసిరేశాడు. దీంతో సిక్స్ ఖాయం అనుకుంటే.. కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది బెంగళూరుకు. రహానే బ్యాటింగ్, ఫీల్డింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై కాన్వే (83), శివమ్ దూబె (52) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరుకు పేలవ ఆరంభం లభించింది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 6 పరుగులకే వెనుదిరిగాడు. అయితే గ్లెన్ మ్యాక్స్‌వెల్ (76), డుప్లెసిస్ (62) మెరుపు వేగంతో ఆడడంతో బెంగళూరు ఒక దశలో విజయం సాధిస్తుందనిపించింది. చివరకు కేవలం 8 పరుగుల తేడాతో ఓడిపోయింది.