petol pump: దేశంలో ఎక్కడైనా పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు ఉచితం
- తాగునీటి సదుపాయం తప్పనిసరిగా ఉండాలి
- ప్రతీ బంకులోనూ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి
- వాహనాల టైర్లలో గాలి ఉచితంగానే నింపాలని కేంద్ర ప్రభుత్వ నియమం
పెట్రోల్ బంకులలో ఇంధనం నింపుకోవడానికి వెళ్లిన కస్టమర్లు కొన్ని ఉచిత సేవలనూ పొందొచ్చని కేంద్రం చెబుతోంది. దేశంలో ఎక్కడైనా సరే.. ఈ ఉచిత సేవలు అందించేందుకు ఒప్పుకుంటేనే బంకు నిర్వహణకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఒకవేళ ఈ సేవలందించేందుకు నిరాకరించినా, డబ్బులు వసూలు చేసినా ఫిర్యాదు చేయొచ్చని రూల్. అయితే, మనలో చాలామందికి ఈ విషయం తెలియదు. ఉచిత సేవల విషయానికి వస్తే.. ప్రతీ బంకులో తప్పనిసరిగా వినియోగదారుల కోసం తాగునీటి సదుపాయం ఉండాలి. ఇందుకోసం బంక్ డీలర్ ఆర్వో యంత్రం, వాటర్ కనెక్షన్ స్వయంగా పొందాలి.
అదేవిధంగా వినియోగదారుల కోసం మరుగుదొడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వాస్తవానికి ఈ టాయిలెట్ సర్వీసు ఉచితం కాదు. దీనికోసం మనకు తెలియకుండానే డబ్బులు చెల్లిస్తున్నాం. పెట్రోల్ బంకుల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రతీ లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ లో నాలుగు నుంచి ఎనిమిది పైసలు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. పెట్రోల్, డీజిల్ నాణ్యతను తెలుసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
వాహనాలకు గాలి నింపడమూ ఉచితమే. టూ, త్రీ, ఫోర్ వీలర్.. వాహనం ఏదైనా సరే టైర్లలో గాలి ఫ్రీగానే నింపాల్సి ఉంటుంది. ప్రతీ బంకులోనూ ప్రథమ చికిత్స కిట్ ఏర్పాటు చేయాలి. గాయపడిన వారికి ప్రథమ చికిత్స చేసే ఏర్పాట్లు తప్పకుండా ఉండాలి. ఇక అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు ఫోన్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ఇందుకోసం బంకులోని ఫోన్ ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఈ ఉచిత సేవలను అందించేందుకు బంకు యజమానులు నిరాకరించిన పక్షంలో ఫిర్యాదు చేస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు.