Virat Kohli: సచిన్ ఓ ఎమోషన్.. ఆయనతో నాకు పోలికా: కోహ్లీ
- సచిన్ తో తనను పోల్చడం ఇబ్బందిగా ఉంటుందన్న కోహ్లీ
- ప్రతి ఒక్కరికీ ఆయనపై నమ్మకం ఉందని, ఆయనో స్ఫూర్తి అని వ్యాఖ్య
- చిన్నతనంలో ఒక ఆటగాడు చూపే ప్రభావం భిన్నంగా ఉంటుందని వెల్లడి
- సచిన్, వివ్ రిచర్డ్స్‌తో ఎవరినీ పోల్చవద్దని సూచన
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో తనను తరచూ పోల్చడం ఇబ్బందికి గురి చేస్తుందని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. సచిన ఎంతో మందికి స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను కోహ్లీ పంచుకున్నాడు.
‘‘సచిన్ తో నన్ను పోల్చిన ప్రతిసారీ నేను నవ్వుకుంటా. ఈ వ్యక్తులకు ఆట గురించి ఎలాంటి అవగాహన లేదు. నంబర్లు, ఇతర విషయాలను పట్టుకుని ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు అర్థంకాదు. నన్ను సచిన్‌తో పోల్చినప్పుడు ఇబ్బంది పడుతున్నా. పరుగులు, ఇతర గణాంకాలు వేరే విషయాన్ని చెబుతాయి. ఇదే సమయంలో చిన్నతనంలో ఒక ఆటగాడు మీపై చూపే ప్రభావం చాలా భిన్నంగా ఉంటుంది’’ అని వివరించాడు.
సచిన్, వివ్ రిచర్డ్స్‌తో ఎవరినీ పోల్చవద్దని కోహ్లీ అన్నాడు. ఎందుకంటే వారు తమ యుగంలో ఆటలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని గుర్తు చేశాడు. ప్రజలకు వారిపై ఉన్న నమ్మకం చాలా అరుదని, ఒక ఆటగాడిపై అంతలా నమ్మకం ఉండటం చాలా అరుదని చెప్పుకొచ్చాడు.
‘‘సచిన్ టెండూల్కర్ నాకు ఎప్పుడూ ఓ ఎమోషన్‌గా ఉంటాడు. ఎవరైనా సరే సచిన్ ను తమ సొంత వ్యక్తిగా చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఆయనపై నమ్మకం, విశ్వాసం ఉంది. ఆయనో స్ఫూర్తి’’ అని వివరించాడు.