Andhra Pradesh: గజదొంగే దొంగా దొంగా అని అరుస్తున్నట్లుంది.. సజ్జలపై అచ్చెన్నాయుడు ఫైర్
- వివేకా హత్యకేసులో మీడియాపై సజ్జల విషం కక్కుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శ
- జగనాసుర చరిత్ర క్లైమాక్స్‌కు వచ్చాక సీబీఐ దర్యాప్తును తప్పుబడుతున్నారని కామెంట్
- వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథలు అల్లుతున్నారని ఆగ్రహం
- ఎవరెన్ని డ్రామాలు ఆడినా నిందితులు తప్పించుకోలేరని వ్యాఖ్య
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తాజాగా విమర్శలు గుప్పించారు. గజదొంగే.. దొంగా, దొంగా అని అరుస్తున్నట్టు సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకా హత్యలో నిందితులు ఎవరో తెలిసాక కూడా సజ్జల మీడియాపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేకా హంతకులు ఎవరో మీడియా చెబితే సహించలేని సజ్జలకు సాక్షిలో వివేకానందరెడ్డిపై వచ్చిన కథనాలు సంతృప్తి కలిగించాయా అని ప్రశ్నించారు. వివేకా హత్యను మొదట చంద్రబాబుకు, ఆపై సునీతారెడ్డికి అంటగట్టి ఇప్పుడేమో వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కథలు అల్లుతున్నారని మండిపడ్డారు. జగనాసుర రక్త చరిత్ర క్లైమాక్స్ వచ్చేసరికి సీబీఐ దర్యాప్తును తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో సజ్జల చెబుతారా? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా వివేకా హత్య కేసు నిందితులు తప్పించుకోలేరన్నారు.