Andhra Pradesh: చంచల్ గూడ జైల్లో వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత
- వివేకా రెడ్డి హత్య కేసులో అరెస్టయిన భాస్కర్ రెడ్డి
- 14 రోజుల రిమాండ్ విధించిన సీబీఐ న్యాయమూర్తి
- ఈ రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ల విచారణపై సందిగ్ధత
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చంచల్ గూడ జైలులో ఉన్న భాస్కర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ ను సీబీఐ ఈ ఉదయం 9 గంటల నుంచి విచారించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురైన విషయం బయటికి వచ్చింది. దాంతో, సీబీఐ అధికారులు ఆయనను విచారించే విషయంపై సందిగ్ధత నెలకొంది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భారతి మేనమామ అయిన భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యకేసులో ప్రధాన సూత్రధారిగా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పులివెందులలో అదుపులోకి తీసుకున్న భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.