India: భారత్‌పై అక్కసు వెళ్లబోసుకున్న చైనా
- త్వరలో జనాభాపరంగా చైనాను అధిగమించనున్న భారత్
- భారత్ నెం.1 స్థానం చేరుకోనుండటంపై స్పందించిన చైనా
- జనాభాలో నాణ్యత ఉండటం ముఖ్యమని కామెంట్
- తమ దేశంలో నైపుణ్యాలున్న కార్మికుల సంఖ్య 900 మిలియన్లు అని వెల్లడి
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనున్న నేపథ్యంలో చైనా తన అక్కసు వెళ్లబోసుకుంది. అధిక జనాభాతో ప్రయోజనం కలగాలంటే ప్రజల్లో నైపుణ్యాలు ఉండాలని చెప్పుకొచ్చింది. కేవలం జనాభా సంఖ్యలో పెరుగుదలతో ఆశించిన ప్రయోజం సిద్ధించదని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెంగ్‌బిన్ తాజాగా మీడియాతో వ్యాఖ్యానించారు. యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్ డేటా ప్రకారం.. 2023 ప్రథమార్థం ముగిసే సరికి భారత్ లో జనాభా చైనాను మించి 142.86 కోట్లకు చేరుకోనుంది. ఈ నివేదికపై స్పందిస్తూ చైనా ప్రతినిధి పై వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే..అధిక జనాభాతో ప్రయోజనం ప్రజల సంఖ్యపై ఆధారపడి ఉండదు. క్వాంటిటీ కంటే క్వాలిటీయే ముఖ్యం. మా దేశంలో 1.4 బిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. వారిలో పనిచేసే వయసులో ఉన్న వారి సంఖ్య 900 మిలియన్లు. వీరందరి సగటు విద్యాభ్యాస సమయం 10.5 ఏళ్లు’’ అని వ్యాఖ్యానించారు. తద్వారా తమ దేశంలో నిపుణులైన కార్మిక వర్గం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.