Lucknow Super Giants: అవేశ్‌ఖాన్ దెబ్బకు రాజస్థాన్ విలవిల.. లక్నో చేతిలో భంగపాటు
- 155 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని ఛేదించడంలో రాజస్థాన్ విఫలం
- క్రమం తప్పకుండా వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టిన లక్నో బౌలర్లు
- అర్ధ సెంచరీతో రాణించిన కైల్ మేయర్స్
154 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు విజృంభించారు. బంతితో రాజస్థాన్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ జట్టుకు విజయాన్ని అందించి పెట్టారు. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆరు మ్యాచుల్లో లక్నోకు ఇది నాలుగో విజయం.
లక్నో నిర్దేశించిన 155 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (44), జోస్ బట్లర్ (40) రాణించినప్పటికీ మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు.
ఆదుకుంటాడనుకున్న దేవదత్ పడిక్కల్ (26) కూడా క్రీజులో కుదురుకోవడంలో విఫలమయ్యాడు. మరోవైపు, అవేశ్‌ఖాన్ మూడు వికెట్లు, మార్కస్ స్టోయినిస్ 2 వికెట్లు తీసి రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు ఇవ్వకుండా ఒత్తిడి పెంచారు. ఫలితంగా పరుగులు పిండుకోవడంలో విఫలమైన రాజస్థాన్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కైల్ మేయర్స్ 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (51) సాధించగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ 39, స్టోయినిస్ 21, పూరన్ 29 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీసుకోగా బౌల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్‌లో నేడు డబుల్ హెడర్ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు మొహాలీలో పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, సాయంత్రం ఏడున్నర గంటలకు ఢిల్లీలో ఢిల్లీ కేపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.