EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎత్తివేత.. ఇక ఎంసెట్ మార్కులతోనే ర్యాంకులు!
- ఇంటర్ మార్కుల ఆధారంగా ఇచ్చే 25 శాతం వెయిటేజీ ఎత్తివేత
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- పలు కారణాలతో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణలో ఎంసెట్ రాసే వారికి ఇది కొంత నిరాశ కలిగించే వార్తే. ఇప్పటి వరకు ఎంసెట్‌లో ఇస్తున్న ఇంటర్ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం శాశ్వతంగా ఎత్తివేసింది. అంటే, ఇకపై ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తారన్న మాట. ఇప్పటి వరకు ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటించేవారు. ఇప్పుడా విధానానికి ప్రభుత్వం మంగళం పాడింది. ఇకపై ఇంటర్ మార్కులతో ఎలాంటి సంబంధం లేకుండానే ఎంసెట్‌లో సాధించిన స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఈ మేరకు ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
జేఈఈ మెయిన్, నీట్‌లోనూ ఇంటర్ మార్కుల వెయిటేజీని ఎత్తివేశారు. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. అయితే, ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, చేసినా వాటిని ఎంసెట్ అధికారులకు అందజేయకపోవడంతో ఎంసెట్ ఫలితాల విడుదలకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతోపాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్ మార్కుల వెయిటేజీని శాశ్వతంగా ఎత్తివేసింది. కాగా, కరోనా కారణంగా 2020, 2021, 2022 లోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వలేదు. ఇప్పుడు దీనిని శాశ్వతంగా తొలగించారు.