TSRTC: హైదరాబాద్ సిటీ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. అరచేతిలోనే బస్సుల సమాచారం!

Now You Can Know Where The Hyderabad City Bus Is

  • అన్ని బస్సుల్లోనూ ‘వీటీఎస్’ ఏర్పాటు
  • ఏ బస్సు ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో తెలుసుకునే వెసులుబాటు
  • ఇప్పటికే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ఏర్పాటు
  • త్వరలోనే ఆర్డినరీ బస్సులకు కూడా..
  • గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే సరి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ వేలాది సిటీ బస్సులు నడుస్తుంటాయి. కానీ, మనం దేని కోసమైతే వేచి చూస్తామో ఆ బస్సు జాడ మాత్రం కనిపించదు. అదెక్కడుందో, ఎప్పుడు వస్తుందో తెలియదు. చూసిచూసి కళ్లు కాయలు కాయాల్సిందే. అయితే, ఇకపై ఆ బాధ ఉండదు. మనం ఎక్కాల్సిన బస్సు ఎక్కడుందో, మనం వేచి చూస్తున్న స్టేజీకి ఎప్పటిలోగా చేరుకుంటుందో ఇకపై ఇట్టే తెలిసిపోతుంది. ప్రయాణికుల వెతలు తగ్గించేందుకు నడుంబిగించిన టీఎస్ఆర్టీసీ సిటీ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్ సిస్టం (వీటీఎస్)ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే మెట్రో బస్సుల్లో ఈ వ్యవస్థను అమర్చింది. ఫలితంగా ఈ బస్సుల సమాచారం టీఎస్ఆర్టీసీ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.

వివరాలన్నీ ప్రత్యక్షం
ఎవరైనా ప్రయాణికుడు ఏదైనా స్టాపులో నిల్చుని తాను వెళ్లాల్సిన బస్సు కోసం వేచి చూస్తుంటే కనుక వీటీఎస్ ద్వారా ఆ మార్గంలో ప్రయాణించే బస్సుల జాడ గురించి తెలుసుకోవచ్చు. బస్సు నంబర్లు సహా మొత్తం వివరాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి. మనం ఎక్కాల్సిన బస్సు ఎక్కడుంది? ఎంతసేపట్లో మనం ఉన్న స్టేజి వద్దకు వస్తుందన్న వివరాలు ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు, మెట్రో, ఎంఎంటీఎస్, రైళ్లలో ప్రయాణిస్తూ కూడా టీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా ఈ సమాచారాన్ని పొందొచ్చు. ఫలితంగా ఆందోళన లేకుండా హాయిగా గమ్యస్థానం చేరుకోవచ్చు.

మెట్రో బస్సుల్లో వీటీఎస్ ఏర్పాటు పూర్తి
హైదరాబాద్‌లో మొత్తం 2,850 సిటీ బస్సులు తిరుగుతుండగా, అందులో 900 బస్సులు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు. ప్రస్తుతం మెట్రో బస్సుల్లో వీటీఎస్ ఏర్పాటు పూర్తయింది. ఆర్డినరీ బస్సుల్లోనూ వీటీఎస్‌ను ఏర్పాటు చేసి యాప్‌తో అనుసంధానించనున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ‘టీఎస్ఆర్టీసీ వెహికల్ ట్రాకింగ్ యాప్’ను డౌన్‌లోడు చేసుకోవడం ద్వారా బస్సుల సమాచారాన్ని పొందొచ్చని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఆర్టీసీ ఈడీ యాదగిరి తెలిపారు.

అలాగే, సిటీ బస్సులో డ్రైవర్ సీటు వెనక కానీ, కండక్టర్ వద్ద పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. జిల్లాలకు వెళ్లే మెట్రో డీలక్స్ నుంచి ఏసీ బస్సుల వరకు ఈ యాప్‌ను అమలు చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News