Delhi AIIMs: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నేపాల్ అధ్యక్షుడు.. నెల రోజుల్లో రెండోసారి ఆసుపత్రిలో చేరిక!

Nepal President Ramachandra Paudel Airlifted To AIIMS Delhi For Treatment
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న పౌడెల్
  • నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఆసుపత్రిలో చేరిన నేపాల్ అధ్యక్షుడు
  • ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలింపు
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న 78 ఏళ్ల పౌడెల్‌ను వాయుమార్గం ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో చేరడం నెల రోజుల్లో ఇది రెండోసారి. శ్వాస సరిగా అందక బాధపడుతున్న పౌడెల్‌ను మంగళవారం ఖాఠ్మాండూలోని త్రిభువన్ యూనివర్సిటీ బోధనాసుపత్రిలో చేర్చారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నిన్న ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించి ఎయిమ్స్‌లో చేర్చారు. 

అధ్యక్షుడు చాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని, బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఇండియాకు తరలించినట్టు అధ్యక్షుడి మీడియా సలహాదారు కిరన్ పోఖరెల్ తెలిపారు. ఆయనతోపాటు కుమారుడు చింతన్ పౌడెల్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్టు పేర్కొన్నారు. 

అధ్యక్షుడు ఖాఠ్మాండూ ఆసుపత్రిలో ఉండగా మంగళవారం ప్రధాని పుష్పకుమార్ దహాల్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి పూర్ణ బహదూరు ఖడ్కా, ఇతర నేతలు కలిసి పరామర్శించారు. కడుపునొప్పితో బాధపడిన అధ్యక్షుడు పౌడెల్ ఈ నెల 1న తొలిసారి ఆసుపత్రిలో చేరారు.
Delhi AIIMs
Nepal
Nepal President
Ramchandra Paudel
Pushpa Kamal Dahal

More Telugu News