Mani Ratnam: భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదు: మణిరత్నం
- హిందీ పరిశ్రమ తనను బాలీవుడ్ గా చెప్పుకోవడం మానివేయాలని సూచన
- భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదని ప్రజలు అర్థం చేసుకుంటారన్న దర్శకుడు
- తాను ‘వుడ్’కు అభిమానిని కాదన్న మణిరత్నం
దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర దర్శకుడు మణిరత్నం హిందీ చిత్ర పరిశ్రమకు ఓ కీలక సూచన చేశారు. హిందీ చిత్ర పరిశ్రమ తనను బాలీవుడ్ అని పిలుచుకోవడం మానుకోవాలని కోరారు. అప్పుడు ప్రజలు కూడా భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదనే విషయాన్ని అర్థం చేసుకుంటారని తెలిపారు. బుధవారం చెన్నైలో సినీ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మణిరత్నం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సమావేశంలో మణిరత్నం ప్రసంగిస్తూ.. ‘‘హిందీ సినిమా తతను తాను బాలీవుడ్ అని పిలుచుకోవడాన్ని ఆపివేయాలి. అప్పుడు ప్రజలు సైతం భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అని గుర్తించడాన్ని ఆపివేస్తారు. నేను బాలీవుడ్, కోలీవుడ్ తరహా ‘వుడ్స్’కు అభిమానిని కాదు. మనం ఈ పరిశ్రమ మొత్తాన్ని భారతీయ సినిమాగానే చూడాలి’’ అని పేర్కొన్నారు. పొన్నియన్ సెల్వన్ సినిమా-2 రూపొందించడంలో ప్రస్తుతం మణిరత్నం బిజీగా ఉన్నారు.
పొన్నియన్ సెల్వన్ సహా గతంలో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాయి. పైగా ఇప్పుడు తెలుగు పరిశ్రమ తీసిన ఎన్నో సినిమాలు సైతం యావత్ దేశం, ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని చూరగొంటున్నాయి. తెలుగు నటీనటులు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ తరుణంలో మణిరత్నం చేసిన సూచన ప్రధానమైనదేనని చెప్పుకోవాలి.