RGV: అది కృత్రిమ మేధ సృష్టించిన ఫేక్ ఫొటో అనుకున్నా.. కేఏ పాల్, జేడీ మీటింగ్ పై ఆర్జీవీ కామెంట్
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న జేడీ లక్ష్మి నారాయణ
- ముడి సరుకు కోసం స్టీల్ ప్లాంట్ కోరిన బిడ్ దాఖలు
- తనకు మద్దతు ఇచ్చిన కేఏ పాల్ తో కలిసి మీడియా సమావేశం
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, సంస్ధలు, ప్రజాసంఘాలు, కొందరు వ్యక్తులు గళం విప్పుతున్నారు. ముడి సరుకు కోసం స్టీల్ ప్లాంట్ కోరిన బిడ్ వేసిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఈ విషయంలో అనూహ్యంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పాల్, జేడీ మీడియా సమావేశం చూసి తానూ షాకయ్యానని తెలిపారు. వీడియో చూసేదాకా ఈ ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్న ఫొటో తొలుత కృత్రిమ మేధ సృష్టించిందని అనుకున్నానని చెప్పారు. ‘మెగా కమెడియన్ కేఏ పాల్ పక్కన కూర్చున్న అల్ట్రా సీరియస్ జేడీ గారిని చూసి షాక్ అయ్యాను. నేను వీడియో చూసే వరకు ఇది ఏఐ రూపొందించిన ఫేక్ ఫొటో అనుకున్నా. నేను చెప్పేది జోక్ కాదు’ అని ట్వీట్ చేశారు.