Nara Lokesh: రూ. 45 కోట్ల భూమిని రూ. 2 కోట్లకే కొట్టేసిన ఘనుడు మంత్రి జయరాం: నారా లోకేశ్
- గుమ్మనూరు జయరాం 180 ఎకరాల ఇట్టినా కంపెనీ భూములు కొట్టేశారన్న లోకేశ్
- కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ డాక్యుమెంట్లు బయటపెట్టిన వైనం
- ఐటీ బినామీ చట్టం ప్రకారం జయరాం అడ్డంగా బుక్కయ్యారని వ్యాఖ్య
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ 180 ఎకరాల ఇట్టినా కంపెనీ భూములను కొట్టేశారంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆరోపిస్తూ ఆధారాలను బయటపెట్టారు. కమర్షియల్ భూమిని వ్యవసాయ భూములుగా చూపించి, కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టారు. రూ. 45 కోట్ల విలువైన భూమిని రూ. 2 కోట్లకు కారుచౌకగా కొట్టేసిన ఘనత జయరాందని అన్నారు. వ్యవసాయంలో లాభం వచ్చిందని చెప్పిన జయరాం... పంట నష్టపరిహారం డబ్బులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.
రైతులు ముందుకు వస్తే ఇట్టినా భూములను రాసిస్తానని జయరాం చెప్పారని... రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుంటారో చెప్పాలని సవాల్ విసిరారు. ఐటీ బినామీ చట్టం ప్రకారం బెంజ్ మంత్రి జయరాం అడ్డంగా దొరికిపోయారని అన్నారు. ఇట్టినా భూములను ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మీరు మాత్రం వందల ఎకరాల భూమికి అధిపతి అయ్యారని... నియోజకవర్గంలో ఒక్క వాల్మీకి కుటుంబం అయినా ఎకరం భూమి కొనే స్థితిలో ఉందా అని అడిగారు.