Chandrababu: నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది: చంద్రబాబు
- ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
- మార్కాపురంలో మహిళలతో ఆత్మీయ సమావేశం
- చంద్రబాబును ప్రశ్నలు అడిగిన మహిళలు
- జవాబులిచ్చిన టీడీపీ అధినేత
ప్రకాశం జిల్లా మార్కాపురంలో టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆడపిల్ల లేదని ఎప్పుడైనా బాధపడ్డారా అన్న ప్రశ్నకు స్పందించారు. ఓ ఆడపిల్ల ఉంటే బాగుండేదని అన్నారు. అయితే అందరు ఆడపిల్లలను సొంతబిడ్డల్లానే భావిస్తానని వివరించారు. ఇంకా పలు ప్రశ్నలకు చంద్రబాబు ఆసక్తికర జవాబులిచ్చారు.
ప్రశ్న 1: ప్రైవేట్ రంగంలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంపై మీ అభిప్రాయం ఏమిటి?
చంద్రబాబు: రాష్ట్రంలో మొట్టమొదటిసారి మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారత కోసం పని చేసింది తెలుగుదేశం పార్టీనే. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు రాజకీయాల్లో మహిళలకు 8 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించారు. దీనికి సంబంధించి ఎప్పుడో ఎన్టీఆర్ అమలు చేస్తే, కేంద్రం ఇప్పుడు చట్టం చేస్తోంది. ఉద్యోగాలు, కళాశాలల్లో యువతులకు నేను 33 శాతం రిజర్వేషన్లు కల్పించాను. చట్టసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తెలుగుదేశం పోరాడుతుంది.
ప్రశ్న-2: ఎస్సీఎస్టీలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై మీరేమంటారు?
చంద్రబాబు: ఎస్సీ,ఎస్టీల కోసం పనిచేసింది తెలుగుదేశమే. ఇళ్లనిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం కేటాయింపులు చేసింది ఎన్టీఆర్ గారు. నేను వచ్చాక అంటరానితనం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, ఎస్సీ ఎస్టీలకు స్వేచ్ఛ, సమానత్వాన్ని అందించాను. పున్నయ్య కమిషన్ 42 ప్రతిపాదనలు చేస్తే అన్నింటినీ ఆమోదించాను. అంబేద్కర్ రాజ్యాంగం మనకు చెప్పింది... అందరినీ సమానంగా చూడమని. ఎస్సీ ఎస్టీలకు సమాజంలో గౌరవం పెంచింది తెలుగుదేశం పార్టీనే.
ఇప్పుడున్న ప్రభుత్వం మాయమాటలతో ఎస్సీఎస్టీలను నమ్మించి, వారి ఓట్లు కొట్టేసింది. ఎస్సీ ఎస్టీ మహిళలపై దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయి. ఏ ఒక్క మహిళ కూడా ఈ ప్రభుత్వంలో ప్రశాంతంగా బతకడం లేదు. తప్పు చేసినవారు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాల్సిందే. భవిష్యత్ లో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరక్కుండా చూసేది తెలుగుదేశం పార్టీయేనని హామీ ఇస్తున్నా.
ప్రశ్న-3 : మిమ్మల్ని సీఈవో సీఎం అంటారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు మీరు ఎలాంటి సహాయం చేయగలరు... ఎంత తోడ్పాటు అందించగలరు?
చంద్రబాబు: నేను ముఖ్యమంత్రి అయినప్పుడు పారిశ్రామికవేత్తలు చాలా తక్కువగా ఉండేవారు. ప్రతి ఒక్కరూ ఎంటర్ ప్రెన్యూర్ కావాలని ఆలోచన చేశాను. అప్పుడప్పుడే పైకి రావాలనుకుంటున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని, పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలకు పరిచయం చేశాను.
ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు చేయడం కాదు... వారే ఉద్యోగాలివ్వాలని చెప్పాను. హైదరాబాద్ మహానగరం ధనికులు ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రపంచంలోనే 65వ స్థానంలో ఉంది. నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు ముందున్నారు. పారిశ్రామికరంగంలో కూడా ముందున్నారు.
ప్రశ్న-4: ఉద్యోగుల డీఏపై మీరు ఆలోచించాలి సార్? మా తప్పుతెలిసొచ్చింది సార్... భవిష్యత్ లో తప్పు చేయం. భవిష్యత్ లో మీరే నాయకులుగా ఉండాలి సార్. మీరు తప్ప ఎవరు వచ్చినా రాష్ట్రానికి ఉపయోగంలేదు సార్.
చంద్రబాబు: తప్పకుండా మీరు చెప్పిన దానిపై ఆలోచిస్తాను. ఉద్యోగుల గౌరవం కోసం పోరాడింది తెలుగుదేశం ప్రభుత్వమే. డబ్బులు లేకపోయినా, రాష్ట్రం విడిపోయి ఆర్థిక సమస్యలున్నా, ఉద్యోగులు ఇబ్బంది పడకూడదని తెలంగాణతో సమానంగా 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాను. పీఆర్సీ పెంచాను. అదీ నాకు ఉద్యోగులపై ఉండే అభిమానం. మీకు న్యాయంచేస్తాను.
ప్రశ్న-5: రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరిస్తారు సార్?
చంద్రబాబు: నిరుద్యోగ సమస్య పరిష్కారంపై నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. ప్రతి ఒక్కరూ కష్టపడి, సంపాదించే మార్గాలు చెబుతాను. వాటిని అందిపుచ్చుకోవడంలో మీరు ఎప్పుడూ ముందుండాలి.
ప్రశ్న-6 : ఆడపిల్ల లేదని మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? మీకు ఆడపిల్ల ఉంటే లోకేశ్ గారిలా రాజకీయాల్లో కొనసాగించేవారా? లేక వ్యాపార బాధ్యతలు అప్పగించేవారా?
చంద్రబాబు: తప్పకుండా నాకు ఒక ఆడపిల్ల ఉండి ఉంటే బాగుండేది. ప్రతి ఆడబిడ్డను నా సొంత బిడ్డగానే భావిస్తాను. మగపిల్లలతో సమానంగా ఆడవారు రాణిస్తారని నమ్ముతాను. ఒకప్పుడు ఆడపిల్లల్ని భారంగా భావించేవారు. అబ్బాయిల్ని చదివించి, అమ్మాయిలకు పెళ్లి చేసి పంపేవారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకపోవడాన్ని చూశాను కాబట్టే, వారి కాళ్లపై వారు నిలబడాలని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను.