Faf Du Plessis: కోహ్లీ, డుప్లెసిస్ దంచికొట్టినా ఆర్సీబీ చేసింది 174 పరుగులే!
- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు× పంజాబ్ కింగ్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 రన్స్ చేసిన ఆర్సీబీ
- డుప్లెసిస్, కోహ్లీ అర్ధసెంచరీలు
- తొలి వికెట్ కు 137 పరుగులు జోడించిన ఓపెనింగ్ జోడీ
- మ్యాక్స్ వెల్ (0), దినేశ్ కార్తీక్ (7) విఫలం
పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ ద్వయం పాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ అదరిపోయే ఆరంభం ఇచ్చారు. కానీ ఇన్నింగ్స్ ముగింపు మాత్రం పేలవం అనే చెప్పాలి. డుప్లెసిస్, కోహ్లీ జోడీ తొలి వికెట్ కు 137 పరుగులు జోడించడం విశేషం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా పర్యాయాలు 200 పైచిలుకు స్కోర్లు నమోదవుతుంటాయి. కానీ గ్లెన్ మ్యాక్స్ వెల్, దినేశ్ కార్తీక్ విఫలం కావడం స్కోరుపై ప్రభావం చూపింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు బ్యాటింగ్ అప్పగించింది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది.
ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలో దిగిన ఫాఫ్ డుప్లెసిస్ తన పాత్రకు న్యాయం చేశాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 84 పరుగులు చేశాడు. డుప్లెసిస్ స్థానంలో ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్సీ చేపట్టిన కోహ్లీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 59 పరుగులు చేశాడు.
అయితే, తొలి వికెట్ రూపంలో కోహ్లీ అవుటయ్యాక వచ్చిన మ్యాక్స్ వెల్ ఆడిన తొలి బంతికే వెనుదిరిగాడు. కోహ్లీ, మ్యాక్స్ వెల్ లను పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బ్రార్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన దినేశ్ కార్తీక్ కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. డీకే 7 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.
మరో ఎండ్ లో డుప్లెసిస్ ధాటిగా ఆడడంతో ఆర్సీబీ స్కోరు 150 మార్కు దాటింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 2, అర్షదీప్ సింగ్ 1, నాథన్ ఎల్లిస్ 1 వికెట్ తీశారు.