Rajasthan: రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ కలకలం రేపిన సచిన్ పైలట్.. బీజేపీ ఎంపీ ధర్నాలో ప్రత్యక్షం!

In embarrassment to Congress Sachin Pilot meets kin of man who died by suicide
  • భూ వివాదం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రాంప్రసాద్ మీనా
  • బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బీజేపీ ఎంపీ ధర్నా
  • ధర్నాలో పాల్గొని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపిన సచిన్ పైలట్
  • నిర్ణీత సమయంలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్
రాజస్థాన్ కాంగ్రెస్‌లో సచిన్ పైలట్ మరోమారు కాకరేపారు. బీజేపీ ఎంపీ నిర్వహించిన ధర్నాలో పాల్గొని సొంత పార్టీకి షాకిచ్చారు. భూ వివాదం కారణంగా రాంప్రసాద్ మీనా (38) ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా స్థానిక సుభాష్ చౌక్‌లో మూడు రోజులుగా బాధిత కుటుంబంతో కలిసి ధర్నా చేస్తున్నారు. 

మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన సచిన్ పైలట్ ఈ ధర్నాలో పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రాంప్రసాద్ తండ్రి, సోదరుడు, కుమారుడిని సచిన్ కలిశారు. రాంప్రసాద్ ఆత్మహత్యపై నిర్ణీత సమయంలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయని, బాధితులకు న్యాయం అందుతుందని అన్నారు.

మంత్రిపై ఆరోపణలు
భూ వివాదం కారణంగా రాంప్రసాద్ మీనా సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ఆయన రికార్డు చేసిన వీడియోలో మంత్రి మహేశ్ జోషితోపాటు ఇతరులపై ఆరోపణలు చేశారు. వారు తమ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం వారేనని ఆరోపించారు. అయితే, రాంప్రసాద్ ఆరోపణలను జోషి ఖండించారు. ఈ నెల 13న బాధిత కుటుంబం తనను కలిసినప్పుడు తాను వారితో అసభ్యంగా ప్రవర్తించలేదని పేర్కొన్నారు. 

బాధిత కుటుంబానికి మద్దతుగా జరిగిన ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేత పైలట్ మాట్లాడుతూ.. నిందితులందరిపైనా నిష్పాక్షిక విచారణ జరగాల్సిందేనని అన్నారు. అంతకుముందు పైలట్‌తో సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ మీనా కూడా బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.
Rajasthan
Congress
Sachin Pilot
BJP
Ramprasad Meena

More Telugu News