USA: అమెరికాలో దుండగుల కాల్పులు... తెలుగు విద్యార్థి దుర్మరణం
- ఓహాయో రాష్ట్రంలో కాల్పుల కలకలం
- రాజధాని కొలంబస్ నగరంలోని ఓ ఫుడ్ కోర్టులో చొరబడి దుండగుల కాల్పులు
- తూటాలకు నేలకొరిగిన ఏలూరు వాసి సాయీశ్ వీర
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
అమెరికాలో మరో తెలుగు యువకుడు తుపాకీ తూటాకు ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ కొలంబస్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు జిల్లా వాసి సాయీశ్ వీర(24) మరణించారు. ఓహాయో రాష్ట్ర రాజధాని నగరం కొలంబస్ ప్రాంతంలో ఫ్రాంక్లిన్ గ్యాస్ స్టేషన్ వెనుక ఫుడ్ కోర్టు ఉంది. స్థానిక కాలమానం ప్రకారం, గురువారం అర్ధరాత్రి 12.50 గంటల ప్రాంతంలో ఇద్దరు ఆగంతుకులు ఫుడ్ కోర్టులోకి చొరబడి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయీశ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వెస్ట్‌బ్రాడ్ స్ట్రీట్‌లోని షెల్ గ్యాస్ స్టేషన్‌లో సాయీశ్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. సాయీశ్ మరణం అతడి కుటుంబంలో పెను విషాదం నింపింది. మధ్యతరగతికి చెందిన సాయీశ్ హెచ్-1బీ వీసా కూడా తీసుకున్నాడు. అందరితో కలివిడిగా ఉండేవాడని, ఏ సాయం అడిగినా కాదనకుండా చేసేవాడని స్నేహితులు తెలిపారు. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.