Dhoni: 17 ఏళ్లకే ధోనీ కంట్లో పడ్డ బౌలర్.. ఇప్పుడు సీఎస్కే తురుపుముక్క
- సీఎస్కేలో కీలక బౌలర్ గా మారిన మతీష పతిరణ
- బెంగళూరుపై విజయంలో కీలక పాత్ర
- 2020లోనే పతిరణను సంప్రదించిన ధోనీ
భారత క్రికెట్ చరిత్రలో విశేష సేవలు అందించిన క్రికెటర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ కొంచెం ప్రత్యేకం. తన కెప్టెన్సీలో మూడు ప్రపంచకప్ లను భారత్ కు తెచ్చిచ్చిన ఏకైక సారథి మహేంద్ర సింగ్ ధోనీయే. చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు విజేతగా నిలబెట్టిన వాడు. కోహ్లీ, పాండ్యా సహా ఎంతో మంది క్రికెటర్లకు అండగా, స్ఫూర్తిగా నిలిచినవాడు. అంతటి అనుభవం ఉన్న ధోనీ ఓ శ్రీలంక కుర్ర బౌలర్ ప్రతిభను ముందే పసిగట్టి సీఎస్కేలో భాగంగా చేసుకున్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.
అతడే మతీష పతిరణ. ఇప్పుడు అతడి వయసు 20 ఏళ్లు. ఇటీవలే ఆర్సీబీ తో మ్యాచ్ లో ఈ బౌలర్ ఎంతో అద్భుతంగా బౌల్ చేశాడు. ఎంతో మంది నుంచి ప్రశంసలు పొందాడు. అంత చిన్న వయసులో డెత్ ఓవర్ లో బౌలింగ్ తో, ఒక వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం వెనుక ధోనీ మార్గదర్శకం ఉందని చెప్పుకోవాలి. ధోనీ 2020లో మొదటిసారి పతిరణను సంప్రదించిన విషయం బయటపడింది.
అప్పుడు పతిరణ వయసు 17 ఏళ్లు. కరోనా మహమ్మారి కారణంగా 2020 ఐపీఎల్ వేదికను యూఏఈకి మార్చారు. 2020లో శ్రీలంక తరఫున అండర్ 19 ప్రపంచకప్ లోనూ పతిరణ పాల్గొన్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన ధోనీ లేఖ రాశాడు. యూఏఈ వచ్చి సీఎస్కేలో భాగం కావాలని కోరాడు. శ్రీలంక మాజీ దిగ్గజ బౌలర్ మలింగ వద్ద పతిరణ శిక్షణ తీసుకోవడం గమనార్హం. పతిరణ వేగం, కచ్చితత్వం మలింగను ఆకట్టుకుంది.