Virat Kohli: కోహ్లీకి కడుపు మంట కావచ్చు.. గంగూలీతో వివాదంపై షేన్ వాట్సన్ వ్యాఖ్యలు!
- ఇటీవలి ఆర్సీబీ - డీసీ మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకోని గంగూలీ, కోహ్లీ
- వారిద్దరి మధ్య ఏం జరిగిందో తనకు తెలియదన్న షేన్ వాట్సన్
- కోహ్లీ కడుపులో తప్పకుండా మంట ఉండే ఉంటుందని వ్యాఖ్య
ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, సౌరబ్ గంగూలీ షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తర్వాత కోహ్లీ, గంగూలీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఈ ఘటనపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ స్పందించాడు.
‘ది గ్రేడ్ క్రికెటర్’ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో కోహ్లీ, గంగూలీ వివాదంపై అడిగిన ప్రశ్నకు వాట్సన్ బదులిచ్చాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందన్న విషయంలో తనకు స్పష్టత లేదన్నాడు. తర్వాత నవ్వుతూనే.. ‘‘వారిద్దరి మధ్య వివాదంపై కొన్ని పుకార్లు ఉన్నాయి. సరిగ్గా ఏం జరిగిందన్నది తెలియకుండా అందులో జోక్యం చేసుకోలేం. అయితే కోహ్లీ కడుపులో తప్పకుండా మంట ఉండే ఉంటుంది. అది మాత్రం పక్కా’’ అని చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఉన్న సమయంలోనే టీమిండియా కెప్టెన్స్ పదవిని కోహ్లీ కోల్పోయాడు. తర్వాత గంగూలీ కూడా బీసీసీఐ చీఫ్ గా దిగిపోయాడు. కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడమే విభేదాలకు కారణమని చెబుతారు. గతంలో పలుమార్లు వీరిద్దరూ పరోక్షంగా విమర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.