Virender Sehwag: రూ.18 కోట్లతో అనుభవం రాదు.. శామ్ కరన్ పై సెహ్వాగ్ వ్యాఖ్యలు
- ఆడితేనే అనుభవం వస్తుందన్న సెహ్వాగ్
- కెప్టెన్ గా చివరి వరకు ఆటను నడిపించాలన్న అభిప్రాయం
- అనుభవం లేకపోవడంతో మూల్యం చెల్లించాల్సి వచ్చిందని విశ్లేషణ
ఇటీవలి ఐపీఎల్ మినీ వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్ శామ్ కరన్. ప్రధానంగా బౌలర్, ఆల్ రౌండర్ కూడా అయిన ఈ ఇంగ్లిష్ క్రికెటర్ పై పంజాబ్ కింగ్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని రూ.18 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. కానీ, ఈ సీజన్ లో ఇప్పటి వరకు అతడు ఆడిన ఆటతీరు చూస్తే.. పంజాబ్ జట్టు యాజమాన్యం బాధపడేలా ఉంది.
గురువారం ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కరన్ ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు. పోనీ బ్యాటుతో అయినా రాణించాడా అంటే 10 పరుగులకే అవుటైపోయాడు. శిఖర్ ధావన్ విరామం తీసుకోవడంతో కెప్టెన్ గా వ్యవహరించి, కనీసం జట్టును అయినా గెలిపించలేకపోయాడు. పర్సులో ఫండ్ ఉందని చెప్పి వేలంలో రెచ్చిపోయి పోటా పోటీగా అంత ధర పెట్టి కొనడం వల్ల ఉపయోగం పెద్దగా ఏమీ ఉండదని తేలిపోయింది. చెన్నై జట్టు రూ.16.25 కోట్లు పెట్టిన కొన్న బెన్ స్టోక్స్ కూడా జట్టుకు భారంగా మారాడనే చెప్పుకోవాలి.
ఈ క్రమంలో ప్రముఖ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ శామ్ కరన్ ను లక్ష్యంగా చేసుకుని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై సెహ్వాగ్ క్రిక్ బజ్ సంస్థతో మాట్లాడుతూ.. ‘‘అతడు ఓ అంతర్జాతీయ ఆటగాడు. కానీ, రూ.18 కోట్లతో అనుభవాన్ని కొనుగోలు చేయలేరు. ఆడినప్పుడే అనుభవం వస్తుంది. వేడెక్కే ఎండలో ఆడినప్పుడు మీ జుట్టు తెల్లబడుతుంది.
అతడ్ని రూ.18 కోట్లు పెట్టి కొన్నాం కనుక మ్యాచులను గెలిపిస్తాడని అనుకుంటాం. కానీ, అతడికి ఆ స్థాయి అనుభవం ఇంకా రాలేదు. నీవు కెప్టెన్. కనుక నీవు క్రీజులో నిలదొక్కుకోవాలి. చివరి ఓవర్ వరకు ఆటను నడిపించాలి. అనుభవం లేకపోవడం వల్లే మూల్యం చెల్లించాల్సి వచ్చింది’’ అని సెహ్వాగ్ పంజాబ్ ఓటమికి కారణాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.