Vallabhaneni Vamsi: నేను టీడీపీ గుర్తుతోనే గెలిచాను.. మరి చింతమనేని ఎందుకు ఓడిపోయాడు?: వల్లభనేని వంశీ
- కోడి పందేల కోసం పర్మిషన్ ఇప్పించాలని నానిని చింతమనేని అడిగారన్న వంశీ
- సొంత నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని హితవు
- రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకుంటారని ఆరోపణ
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు 10 మంది పోటీ పడుతున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గన్నవరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ... ముందు ఆయన నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని అన్నారు. వల్లభనేని వంశీ టీడీపీ తరపున గెలిచారన్న చింతమనేని వ్యాఖ్యలపై స్పందిస్తూ... తాను టీడీపీ గుర్తుపై గెలిచిన మాట నిజమేనని, అదే టీడీపీ గుర్తుతో చింతమనేని ఎందుకు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. కోడిపందేలు ఆడించుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని కొడాలి నానిని గతంలో చింతమనేని అడిగారని చెప్పారు.
తాను చంద్రబాబు స్కూల్ నుంచే వచ్చానని... ఎన్నికల సమయంలో రాజ్యసభ సీట్లను చంద్రబాబు ఎలా అమ్ముకుంటారో తమకు తెలుసని అన్నారు. గన్నవరం నుంచి పోటీ చేయాలని లోకేశ్ కు తాను గతంలోనే సవాల్ విసిరానని... తన సవాల్ పై ఆయన ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. వైసీపీ వెంటిలేటర్ పై లేదని... టీడీపీనే వెంటిలేటర్ పై ఉందని అన్నారు.