PSLV C-55: రేపు పీఎస్ఎల్వీ సి-55 ప్రయోగం... సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో పూజలు
- రెండు సింగపూర్ ఉపగ్రహాలను మోసుకెళ్లనున్న పీఎస్ఎల్వీ
- ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2.19 గంటలకు నింగిలోకి!
- ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వెల్లడి
- ఇది పూర్తి వాణిజ్యపరమైన ప్రయోగం అని వివరణ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రేపు (ఏప్రిల్ 22) శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సి-55 రాకెట్ ప్రయోగం చేపడుతోంది. రేపు మధ్యాహ్నం 2.19 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ పేర్కొన్నారు. ఆ మేరకు సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ ఆలయంలో డాక్టర్ సోమనాథ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రేపటి రాకెట్ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైనదని ఆయన వెల్లడించారు. పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగాల్లో ఇది 5వ ప్రయోగం అని వివరించారు. సంవత్సరానికి 12 రాకెట్ ప్రయోగాలు నిర్వహించేలా శ్రీహరికోట షార్ లో ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు. త్వరలో చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య వంటి అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు.
కాగా, రేపు చేపట్టే రాకెట్ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చనున్నారు. ఇందులో ప్రధానమైనది టీఈఎల్ఈఓఎస్-2 ఉపగ్రహం... ఇది భూ పరిశీలన నిమిత్తం రూపొందించినది. ఇక రెండోది ల్యూమ్ లైట్-4... ఇది టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ నానో శాటిలైట్. ఈ రెండు ఉపగ్రహాల బరువు 757 కిలోలు.