Chandrababu: అమెరికాలో ఏపీ విద్యార్థి మరణం చాలా బాధ కలిగించింది: చంద్రబాబు
- ఒహాయో రాష్ట్రంలో దుండగుల కాల్పులు
- తీవ్రగాయాల పాలైన సాయీశ్ వీర
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- సాయీశ్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపిన చంద్రబాబు
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు జిల్లాకు చెందిన 24 ఏళ్ల సాయీశ్ వీర అనే విద్యార్థి మరణించడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిన్న అమెరికాలో ఓ తెలుగు విద్యార్థి కాల్పుల్లో మృతి చెందాడన్న విషయం చాలా బాధ కలిగించిందని తెలిపారు.
తీవ్ర వేదనలో ఉన్న అతడి కుటుంబానికి, బంధుమిత్రులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సాయీశ్ వీర మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఎన్నారై టీడీపీ విభాగం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
కొలంబస్ నగరంలో ఓ ఫుడ్ కోర్టులో గురువారం అర్ధరాత్రి ఇద్దరు సాయుధులు చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాయీశ్ వీర తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.